ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది.
తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రతను సంతరించుకుంది. పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చిన ఈ లేఖలన్నీ ఒకే ఉద్దేశంతో.. సింధూ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. భారత్ మాత్రం ప్రస్తుతం చర్చలలో ఆసక్తి చూపకపోవడమే కాకుండా, ప్రోటోకాల్ ప్రకారం ఈ లేఖలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చింది.
భారత ప్రధాని మోదీ గతంలో స్పష్టంగా చెప్పారు – “రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవు.” అంటే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా, భారత్‌పై దాడులకు వెనక నుంచి తోడ్పాటును కొనసాగిస్తూనే… నీటి కోసం కరుణాపూర్వకంగా లేఖలు రాయడం అసహ్యకరమని భావిస్తున్నారు విశ్లేషకులు.
1960లో ప్రపంచ బ్యాంకు మద్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్‌కు హక్కులు అప్పట్లో ఇచ్చారు. కానీ కాలం మారింది… పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ వైఖరి వల్లే ఇప్పుడు ఈ ఒప్పంద భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.