నేతలు ఇలా పడిపోతున్నారేంటి?.. ఈ రోజు కొండా వంతు!

అదేంటో గానీ తెలుగు నేలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా కుప్పకూలి పడిపోతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో మైకు పట్టుకుని మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా గురువారం తెలంగాణ వంతు వచ్చినట్టుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ సచివాలయంలో కుప్పకూలి కింద పడిపోయారు. కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన సురేఖ… తన కార్యాలయానికి వెళ్లే క్రమంలోనే దారి కుప్పకూలారట. దీంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను లేపి కార్యాలయంలోకి తీసుకెళ్లిన వ్యక్తిగత సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమెకు కొంత ఆహారం పెట్టగా… కాసేపట్లోనే ఆమె తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎంచక్కా కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. 

అయినా కొండా సురేఖ ఎందుకు కిందపడ్డారన్న విషయానికి వస్తే…ఆమెకు షుగర్ తో పాటు లోబీపీ కూడా ఉందట. డయాబెటీస్, బీపీ హెచ్చుతగ్గులు  ఉన్న వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయితే గురువారం ఉదయం నుంచి ఆమె ఎంత బిజీగా ఉన్నారో గానీ… ఉదయం నుంచి ఆహారమే తీసుకోలేదట. దీంతో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటుగా బీపీ పడిపోయిందట. ఫలితంగా కళ్లు తిరిగినట్టైన సురేఖ..నడుస్తూనే అలా కుప్పకూలిపోయారు. ఈ కారణంగానే కాస్తంత ఆహారం అందగానే ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహా, పలువురు మంత్రులు సురేఖను పరామర్శించారు.

ఇదిలా ఉంటే.. ఇటు కొండా సురేఖ అయినా, అటు బొత్స సత్యనారాయణ అయినా… వయసురీత్యా పెరుగుతున్న అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు గమనిస్తూనే ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఓ వైపు షుగర్, మరోవైపు బీపీ సమస్యలు పెట్టుకుని కూడా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం చూస్తుంటే…ఆమె తన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే చెప్పాలి. ఇటు బొత్స సత్యనారాయణ విషయానికి వచ్చినా… తాను కూడా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం నాడు ఎండ దంచికొడుతోంది. జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాల్సిన బొత్స.. అవేవీ పట్టించుకోకుండానే మండుటెండలో ప్రసంగానికి దిగారు. ఎండవేడిమికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు.