ఏపీలో పాలనా పరంగా తీసుకువచ్చిన అనేక మార్పులు ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్తగా లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి, ఉపాధి మరింత వేగంగా ప్రజలకు చేరువ అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్ రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు.
ఫస్ట్ స్టేజ్‌లో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం, దుగదర్తి ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ఈ కార్పొరేషన్ దృష్టి పెడుతుందని సీఎం చెప్పారు. వచ్చే సంవత్సరం.. 4 పోర్టులు, 4 హార్బర్లు పూర్తి చేయనున్నట్టు ఆయన వివరించారు. ఇక, ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్(పీపీపీ) భాగస్వామ్యంతో రాష్ట్రంలోని స్టేట్ లెవిల్ రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేప్రాజెక్టులను కూడా.. ఈ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని సీఎం చెప్పారు. దాదాపు అన్ని స్టేట్ లెవిల్ రోడ్లను కూడా నేషనల్ రోడ్లతో లింకు చేయాలని సూచించారు.
ప్రజలు ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు.. వారిని సంతోష పరిచేలా పాలన ఉండాలని సూచించారు. ఎవరో తప్పులు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తే.. దానిని చాలా సీరియస్‌గా తీసుకుంటామన్నారు. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వం పనులు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సమయంలో.. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని.. ఈ పనులను మరింత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతోనే కొత్తగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.