ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ.. మళ్లీ జైలుకు వంశీ

కేసుల సుడిలో చిక్కుకున్న వైసీీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయనను పోలీసులు నేరుగా బెజవాడ జిల్లా జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో వంశీకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే రద్దు అవుతుందని నాడు కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించిన పోలీసులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన వంశీని జైలుకు తరలించారు.

దళిత యువకుడి కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, భూకబ్జాలు, అక్రమంగా ఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్… ఇలా వంశీపై లెక్కలేనన్ని కేసులు వరుసబెట్టి నమోదు అయ్యాయి. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ…ఆ తర్వాత ఈ కేసులనూ ఎదుర్కోక తప్పలేదు. ఒక కేసులో బెయిల్ వస్తే… మరో కేసులో రిమాండ్ పొడిగించడం వంటి కారణాలతో వంద రోజులకు పైగానే వంశీ బెజవాడ జైలులో రిమాండ్ ఖైడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వంశీ.. జైలు జీవితం కారణంగా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. అసలు మనిషి గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.

ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు బెయిల్ ఇవ్వాలని… కనీసం వైద్యం చేయించుకునేందుకు అయినా బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఇటీవలే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు వంశీకి తక్షణమే వైద్యం అందించాలని, వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను ఈ నెల 5లోగా తనకు సీల్డ్ కవర్ లో అందించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ నేరుగా ఆయుష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పరీక్షలు ముగిశాయని చెప్పి వంశీని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 5న హైకోర్టుకు ఆయుష్ ఆసుపత్రి వైద్యులు వంశీకి సంబందించిన ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టుకు అందించనున్నారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత గానీ వంశీ భవిష్యత్తు ఏమిటన్న దానిపై స్పష్టత వచ్చేలా లేదు. నిజంగానే వంశీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తక్షణ వైద్యం అవసరమని వైద్యులు సూచిస్తే… వైద్యం చేయించుకునేందుకు వంశీ మరోమారు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇవన్నీ సర్వసాధారణ రోగాలేనని వైద్యులు చెబితే.. మరింత కాలం పాటు వంశీ జైలు జీవితం గడపక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.