5 కాదు 11.. కేసీఆర్ వ్యూహమేంటీ?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన వ్యూహాన్ని సడెన్ గా మార్చేశారు. బీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలపై ఏర్పాటు అయిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు అయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నా… ఎందుకనో గానీ సోమవారం ఆయన తన నిర్ణయాన్ని మార్చేశారు. ఈ నెల 5న కాకుండా 11న కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సోమవారం ఉదయమే కమిషన్ కు తెలియజేసింది. కేసీఆర్ విచారణకు అయితే హాజరు అవుతారు గానీ… ఈ నెల 5న కుదరదని, 11న ఆయన విచానణకు వస్తారని ఆ పార్టీ కమిషన్ కు రాసిన లేఖలో తెలిపింది. ఈ లేఖపై కమిషన్ కూడా వేగంగానే స్పందించింది. కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ నెల 11ననే విచారణకు రమ్మనండి అంటూ కమిషన్ తన సమ్మతిని తెలియజేసింది. వెరసి కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ ఈ నెల 5న కాకుండా ఈ నెల 11న హాజరు అవుతారు.

ఇదిలా ఉంటే… సడెన్ గా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చకు తెర లేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ తో పాటు నాటి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లు కూడా హాజరు కానున్నారు. కేసీఆర్ ను 5న రమ్మన్న కమిషన్… 6న హరీశ్ ను, 9న ఈటెలను విచారణకు రమ్మని పిలిచింది. ఈ నోటీసులపై కేసీఆర్, హరీశ్ రావులు పలుమార్లు బేటీ అయి చర్చోపచర్చలు చేశారు. ఈ చర్చల ఫలితంగానే తాజాగా కేసీఆర్ వ్యూహం మార్చినట్లుగా సమాచారం.

కమిషన్ విచారణకు హాజరు అవుతున్న ముగ్గురం ఒకే రీతి సమాధానాలు చెప్పాలని… అలాగైతేనే విచారణ నుంచి మనం బయటపడగలం అని హరీశ్ రావుతో కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఈటెలతోనూ హరీశ్ భేటీ అయ్యారన్న పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లను హరీశ్, ఈటెల ఇద్దరూ ఖండించారు. అందులో ఏ మేర వాస్తవముందో తెలియదు గానీ.. ముందుగా హరీశ్, ఈటెల విచారణ ముగిసిన తర్వాత వారు ఏం చెబుతారన్న దానిపై పరిశీలన చేసి ఆ తర్వాత విచారణకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ కారణంగానే 6న హరీశ్, 9న ఈటెల విచారణ ముగియగానే… 11న కమిషన్ ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.