-->

గాంధీ భ‌వ‌న్‌లో అటెండ‌రు పోస్టు ఇచ్చినా చేస్తా: జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం పీసీసీ స‌హా.. రాష్ట్ర స్థాయిలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రికి బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు.

అయితే.. కీల‌క ప‌ద‌వులు అయిపోయాయ‌ని.. ఇక‌, మిగిలింది.. నామ్ కేవాస్తే ప‌ద‌వులేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. ప‌ద‌వుల‌పై త‌నకు ఆశ‌లేద‌ని.. అలాగ‌ని త‌ను వ‌ద్ద‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. అన్ని ప‌ద‌వులు అయిపోయాన‌ని.. త‌న స‌హ‌చ‌రులు కూడా చెబుతున్నా ర‌ని చెప్పారు. కానీ.. త‌న‌కు కూడా ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌ని సంకేతాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఏ ప‌ద‌వి ఇచ్చినా.. త‌న‌కు ఓకేనేని చెప్పారు.

“చివ‌ర‌కు గాంధీభ‌వ‌న్‌లో నువ్వు అటెండ‌రుగా ఉండు. అన్నా.. కూడా చేస్తా. నేను పార్టీ మ‌నిషిని. న‌న్ను ఎవ‌రో గుర్తించేంది..ప్ర‌జ‌లు గుర్తించాలి. గుర్తించారు.” అని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ నాయ‌కుడు ర‌ఘునంద‌న్‌రావుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. రాహుల్ గాంధీని విమ‌ర్శించే స్తాయి ర‌ఘనంద‌న్‌కు లేద‌ని చెప్పారు. ఆయ‌న త‌న స్థాయిని తెలుసుకుని మాట్లాడాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘ‌న‌త కాంగ్రెస్‌దేన‌ని చెప్పారు.

దేశంలో 544 సంస్థానాల‌ను, రాచ‌రికాల‌ను కూడా భార‌త్‌లో విలీనం చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. గాందీల‌ కుటుంబం ఈ దేశానికి ఇద్ద‌రిని బ‌లి ఇచ్చింద‌ని.. ఇప్పుడు బీజేపీలో ఉన్న‌వారు ఎంత మందిని ఈ దేశం కోసం త్యాగంచేశారో.. చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. అల్లరి చిల్ల‌రి వేషాలు వేస్తే.. త‌గిన విధంగా బుద్ధి చెప్పాల్సి వ‌స్తుంద‌ని జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు.