వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు ఎలా రెచ్చిపోయారో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ‘డెడ్ బాడీ డోర్ డెలివరీ’ వ్యవహారం మరింతగా కలకలం రేపింది. తన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్‌ను వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు.. దారుణంగా హత్య చేసి.. శవాన్ని డోర్ డెలివరీ చేశారని.. అప్పట్లో విపక్షాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశాయి.
పైగా డ్రైవర్ దళితుడు కావడంతో దళిత సామాజిక వర్గాలకు చెందిన వారు మరింతగా ఆందోళన చేశారు. అయినా.. వైసీపీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు.. చర్యలు తీసుకునేందుకు కూడా చాలా వెనుకాడింది. దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. సంకేతాలు అందిన తర్వాత కానీ… ఆయనను చూచాయగా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెన్షన్‌ను తిరిగి ఆరు మాసాలకే ఎత్తేశారు. గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
ఇక, హత్య కేసు ఏమైందంటే.. ఇప్పటికీ అంతుచిక్కదు. ఇదిలావుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం.. కేసును తిరగ దోడేందుకు ప్రయత్నాలు జరగుతున్నారు. మరోవైపు.. తాజాగా సుబ్రహ్మణ్యం సోదరుడు.. వీధి నవీన్ (34)కు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇచ్చింది. స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తూ.. తాజాగా అప్పాయింట్‌మెంటు ను కూడా అందించింది.
దీంతో సుబ్రహ్మణ్యం కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే.. కేసులో నిందితుడుగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడు తున్నారన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో అతనిని అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.