ముక్కోడు..తిక్కోడు.. నన్నూరి పంచ్ వైరల్

టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి పేరు టీడీపీ కార్యకర్తలందరికీ సుపరిచితమే. తెలంగాణ టీడీపీ నేత అయిన నన్నూరి నర్సిరెడ్డి తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేస్తుంటారు. తనకు మాత్రమే సొంతమైన ప్రాసతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీ నేతలపై నర్సిరెడ్డి వేసే పంచులు, సెటైర్లు వైరల్‌గా మారుతుంటాయి. మహానాడు వంటి మహాసభలతో పాటు టీడీపీ సభలలో తనదైన శైలిలో నన్నూరి చెప్పే డైలాగులు సభకు వచ్చిన నేతలతో పాటు టీడీపీ శ్రేణులలో కొత్త జోష్ నింపుతుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా కడపలో జరుగుతున్న మహానాడులో కూడా నన్నూరి చెప్పిన డైలాగ్ ఒకటి వైరల్‌గా మారింది. ఆంధ్రా, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పే క్రమంలో నన్నూరి చెప్పిన డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ‘‘ప్రస్తుతం అద్భుతమైన వాతావరణం ఉంది… మొన్నటి వరకు ఒక రకంగా ఉండే… మాకాడ ముక్కోడు పోయిండు… మీ కాడ తిక్కోడు పోయిండు…ముక్కాయన లిఫ్ట్ ఇరిగేషన్… తిక్కాయన ఆత్మలతో మాట్లాడుతున్నడు’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఢిల్లీ వీధుల్లో దిగజారుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని నర్సిరెడ్డి అన్నారు. పేదల కోసం, బీదల కోసం… ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ 9 నెలల్లోనే అధికారం చేపట్టి దేశ రాజకీయాల్లో సంచలనం రేపిందని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చిందని, గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందాయని.. ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరాయని నర్సిరెడ్డి అన్నారు. చెట్టు మీద కూర్చొన్న పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదని, దాని రెక్కల బలాన్ని నమ్ముకుంటుందని, టీడీపీ కూడా కార్యకర్తల బలాన్ని, బలగాన్ని నమ్ముకుందని అన్నారు.

ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును నర్సిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. తెలుగు జాతి… విశ్వఖ్యాతి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు.