పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడడం, ఆ తర్వాత ఇరుదేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పీవోకేను భారత్ తిరిగి ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీవోకే ప్రజలు మనోళ్లేనని, ఏదో ఒక రోజు పీవోకే దానంతట అదే తిరిగి వస్తుందని రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ పీవోకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారని వ్యాఖ్యానించారు. ఆరోజు ఎంతో దూరంలో లేదని, అప్పుడు పీవోకే దానంతట అదే భారత భూభాగంలో కలిసిపోతుందని చెప్పారు. పీవోకే దానంతట అదే తిరిగి వస్తుందని, అక్కడి ప్రజలకు భారత్ తో దృఢమైన సంబంధాలున్నాయని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. పీవోకేలో కొందరు మాత్రమే తప్పుడు దారిలో నడుస్తున్నారని అన్నారు
గ్రేట్ ఇండియా సంకల్పంతో పోతున్నామని, దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ తో నిరూపించామని అన్నారు. ఏమైనా చేయగలిగే సత్తా భారత్ కు ఉందని, కానీ శక్తితో పాటు సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశీయంగా అభివృద్ధి చెందిన క్షిపణులను, వ్యవస్థలను ఉపయోగించామని, అది ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిందని అన్నారు. మనం ఇప్పుడు ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడం, కొత్త తరం యుద్ధ సాంకేతికత వంటి విషయాలపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు.
ఉగ్రవాద వ్యాపారం నడపడం సులువు అని, దానికోసం పెద్ద ఖర్చేం కాదని అన్నారు. అయితే, అందుకు భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని, అది ఇప్పుడు పాక్ కు అర్థమైందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం 23 నిమిషాల్లో తుడిచి పెట్టేసిందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.