తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీగానే కాకుండా తెలంగాణను పదేళ్ల పాటు పాలించి… ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం హోదాలోకి మారిపోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ముసలం మరింతగా ముదిరిందనే చెప్పాలి. గురువారం ఉదయమే మీడియా ప్రతినిధులతో తన ఇంటిలో చిట్ చాట్ నిర్వహించిన బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ తీరుపైనే నిప్పులు చెరిగారు. నేతల పేర్లు ప్రస్తావించకుండానే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు నేల రాజకీయాల్లో పెను కలకలమే రేపుతున్నాయి.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర…
ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లోని కొందరు నేతలు పార్టీని కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఇప్పటికే ఓ ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు అందిన సమాచారం మేరకు జూన్ 2న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని ఆమె తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్రకు తెర లేసిందని కూడా కవిత ఆరోపించారు. తాను మాత్రం ఈ కుట్రపై వ్యతిరేక గళం వినిపించానని… బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పానని తెలిపారు. తాను జైలుకు వెళ్లేటప్పుడే బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా… కేసీఆరే వద్దని వారించారని ఆమె తెలిపారు.
నా జోలికి వస్తే ఖబద్దార్…
చిట్ చాట్ కు రావడం రావడంతోనే కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్ లోని కొందరు నేతలపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తనపై ఇతర పార్టీలు, వ్యతిరేక మీడియా అసత్య కథనాలు, అర్థ సత్యాలతో కూడిన కథనాలు, అభూత కల్పనలతో కూడిన కథనాలు వస్తుంటే… బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేసే పార్టీలకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించారు. సొంతింటి ఆడబిడ్డ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె… ఇంటి ఆడపడచుపై పడి ఏడిస్తే మీకు ఏమోస్తుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా తన జోలికి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన కవిత… తన జోలికి వస్తే తాను అసలే మంచి దాన్ని కాదంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఒక్కరే లీడర్..
బీఆర్ఎస్ కు కేసీఆర్ ఒక్కరే నాయకుడని కవిత అన్నారు. కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తామని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారన్న కవిత… అది అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ నాయకత్వాన్ని, లీడర్ షిప్ ను మాత్రమే అంగీకరిస్తానని తేల్చి చెప్పారు. కేసీఆర్ కాకుండా ఇతర నేతల నాయకత్వాన్ని తాను ఎంతమాత్రం అంగీకరించ బోనని కూడా ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చాలామంది చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత… కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్లు అయిపోయారా? అంటూ సెటైర్లు సంధించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు లేవని నిరసనలు.. మరో నేతకు నోటీసులు ఇస్తే మాత్రం నిరసనల హంగామా ఎందుకని ఆమె ప్రశ్నించారు.
లీకు, గ్రీకు వీరులెవరు?…
వాస్తవానికి కవిత విదేశీ పర్యటనలో ఉండగా… ఆమె కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన లేఖ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ లేఖ లీకేజీనే అసలు వివాదానికి కారణంగా నిలుస్తోందని చెప్పక తప్పదు. ఇప్పుడు కవిత అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన లేఖను లీక్ చేసిన లీకువీరులు ఎవరో తేల్చాలని తాను డిమాండ్ చేస్తే… గ్రీకు వీరులు తనపై దండెత్తుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తనను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తన పార్టీ బీఆర్ఎస్ అని, తాను ఎప్పటికీ బీఆర్ఎస్ నేతనేనని తెలిపారు. బీఆర్ఎస్ చేయాల్సిన చాలా పనులను జాగృతి తరఫున తాను చేస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేందుకు సిద్ధమైన ఓ నావలాంటిదన్నకవిత… ఆ పార్టీతో తాను ఎందుకు రాయబారం నెరపుతానని ప్రశ్నించారు.