టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పై సీరియస్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ నాయకులు తమ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మహానాడు వేదిక పై మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా బనకచర్లలో నిర్మించే భారీప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా.. మళ్లించి.. బనకచర్లలో నిల్వ చేసి.. కర్నూలు సహా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందించాలన్నది తమ సంకల్పంగా చెప్పుకొచ్చారు.
దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా రెడీ అయిందన్న చంద్రబాబు.. కేంద్రంతోనూ పలుమార్లు చర్చించామని.. దీనికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ, దీనిపై బీఆర్ఎస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. “గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే.. వాటిని వాడుకునేందుకు మేం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. దీనిని కూడా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు నేను ఒక్కటే చెబుతున్నా.. సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తప్పా? ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా?” అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ఆపాలని సూచించారు. బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని, సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాయల సీమను సస్యశ్యామలం చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. దీనికి కేంద్రం కూడా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇక, ఏ ప్రాజెక్టు కట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు స్వార్థం లేదన్నారు. తెలుగు ప్రజల కోసమే పని చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
కర్నూలు జిల్లా బనకచర్లలో భారీ ప్రాజెక్టు కట్టాలనేది చంద్రబాబు ప్రభుత్వనిర్ణయం దీనికి 80 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంద ని అంచనా వేశారు. అయితే.. దీనివల్ల తమకు ముప్పు వస్తుందని తెలంగాణలోనికాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే రిప్రజం టేషన్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. అంతేకాదు.. దీనిని అడ్డుకుంటామని మంత్రులు కూడా ప్రకటించారు. ఇక, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా.. ఏపీ బనకచర్ల కట్టేందుకు సిద్ధమైతే.. రేవంత్ రెడ్డి కళ్లు మూసుకున్నారని గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన చంద్రబాబు బీఆర్ ఎస్‌పై విమర్శలు గుప్పించారు.