ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. తర్వాత తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలై అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. విదేశీ భాషల్లో కూడా రీమేక్ అయిన ఈ సినిమాకు తర్వాత సీక్వెల్ వచ్చింది. అది ఓటీటీలో రిలీజై అద్భుత స్పందన తెచ్చుకుంది.
ఇప్పుడీ సినిమాకు రెండో సీక్వెల్ తీస్తున్నారు మోహన్ లాల్, జీతు జోసెఫ్. ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ ముగిసినట్లుగా కనిపించిన కథను జీతు ఇంకెలా విస్తరించాడు.. ఈసారి ఏం ట్విస్టులు ఇస్తాడు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
తన కూతురిని ఇబ్బంది పెట్టిన కుర్రాడు చనిపోతే జార్జ్ కుట్టి దాన్ని కవర్ చేస్తూ కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేశాడనే నేపథ్యంలో దృశ్యం కథ నడిస్తే.. దృశ్యం-2లో ఈ పాత కేసును తవ్విన పోలీసులకు చెక్ పెట్టాడనే కోణంలో సాగుతుంది. ఐతే మూడో పార్ట్‌లో జార్జ్ కుట్టి పాత్రకు సంబంధించి ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుందట.
తన కుటుంబానికి కూడా తెలియకుండా దాచి పెట్టిన ఒక విషయం మీద అతను అంతర్మథనానికి గురవడం.. ఆ పరిస్థితుల్లో అతనేం చేశాడనే నేపథ్యంలో దృశ్యం-3 నడుస్తుందట. జార్జ్ కుట్టి దాచిపెట్టిన సీక్రెటే ఈ సినిమాలో హైలైట్ అని సమాచారం.
ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాకైపోతారని ఇందులో కీలక పాత్ర పోషించిన ఆశా శరత్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐతే దర్శకుడు జీతు మాత్రం ఇందులో ట్విస్టులకంటే ఫ్యామిలీ డ్రామానే హైలైట్ అని పేర్కొన్నాడు.
మరి ‘దృశ్యం-3’ ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుంటుందో చూడాలి. ముందు మలయాళంలో విడుదలయ్యాక.. హిందీ, తెలుగు వెర్షన్లు కొంచెం ఆలస్యంగా రిలీజవుతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates