తెలంగాణలో వచ్చే నెల 5న ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ నుంచి విచారణకు హాజరయ్యే విషయంపై సానుకూలత వ్యక్తం కాగా… విచారణ సందర్భంగా కమిషన్ వేసే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలన్న దానిపై ఆయన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తనతో బేటీ అయిన తన మేనల్లుడు, మాజీ సాగునీటి శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆయన బుధవారం మరోమారు తన ఫాం హౌస్ కు పిలిపించుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏకంగా రూ.1 లక్ష కోట్ల మేర ఖర్చు అయ్యింది. అయితే ప్రాజెక్టు పూర్తి అయిన మూడేళ్లకే ప్రాజెక్టు బ్యారేజీలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సర్కారు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పలుమార్లు ప్రశ్నించింది. తాజాగా తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, నాటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ పెద్దగా స్పందించరని అంతా భావించారు. అయితే భిన్నంగా సాగిన కేసీఆర్… కమిషన్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విచారణలో కమిషన్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఎలా ఉంటాయి? వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అన్న దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో బాగంగా ఇప్పటికే హరీశ్ రావు ఎర్రవలిలోని ఫాంహౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా బుధవారం కూడా కేసీఆర్ పిలుపు మేరకు హరీశ్ రావు మరోమారు ఫాం హౌస్ చేరుకుని కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణపైనే వీరిద్దరూ చర్చిస్తున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే…కేసీఆర్ ఆరోగ్యం ఇప్పుడు అంతగా ఏమీ బాగోలేదు. వయోభారం, గతంలో బాత్ రూంలో జారిపడిన సందర్భంగా అయిన గాయాలు, ఆ తర్వాత చుట్టుముట్టిన పలు అనారోగ్య సమస్యల కారణంగా కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. ఏదో అత్యవసరమైతే తప్పించి ఆయన బయటకు రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆయన నేరుగా హాజరు అవుతారా? లేదంటే… వర్చువల్ గా విచారణకు హాజరు అవుతారా? అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఏ పద్దతిలో విచారణకు హాజరైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతకు సంబంధించి కేసీఆర్ కమిషన్ కు ఇచ్చే వివరణలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.