బాబు మార్క్ పాలిటిక్స్ – నేతల ప్రసంగాలకు ర్యాంకులు!

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీలో తనతో మొదలు సాధారణ కార్యకర్త వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని చంద్రబాబు కోరుకుంటారు. అంతేకాదు, పనితీరు ఆధారంగా సాధారణ కార్యకర్త నుంచి లోకేష్ వరకు అందరినీ సమానంగా చూడడం చంద్రబాబు నైజం. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ కార్డులివ్వడం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం.

ఈ క్రమంలోనే తాజాగా మహానాడు సందర్భంగా తన పాలిటిక్స్ ను మరోసారి చంద్రబాబు చూపించారు. మహానాడులో పలువురు టీడీపీ నేతలు ప్రసంగాలపై కార్యకర్తల నుంచి చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. మహానాడులో చాలామంది టీడీపీ నేతలు ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఏదో వచ్చారు..ప్రసంగించారు..వెళ్లిపోయారు..అన్న రీతిలో కాకుండా ఆ ప్రసంగాలపై టీడీపీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

వాట్సాప్, ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు. టీడీపీ అంటే పెద్ద నాయకులే కాదని అందరు కలిస్తేనే పార్టీ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమర్థవంతంగా పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, సామర్థ్యాన్ని బట్టి గుర్తింపునిస్తున్నామని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా నేతలు బాగా మాట్లాడుకుంటే ఆ విషయాన్ని వారికి చెప్పి మెరుగుపరుచుకునేలా సూచనలిస్తామని చంద్రబాబు అన్నారు.

అలా లేని పక్షంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని తేల్చి చెప్పారు. పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలంటే కష్టపడాలని అన్నారు. తాను కూడా ప్రసంగానికి ముందు రోజు రాత్రి మూడు, నాలుగు గంటలు ప్రిపేర్ అవుతానని చంద్రబాబు చెప్పారు. ఇలా వాట్సాప్ ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో కొల్లు రవీంద్ర ప్రసంగం బాగుందని 93.1% మంది అభిప్రాయపడ్డారని అన్నారు. ఇక, రవి నాయుడు 86%, మద్దిపాటి వెంకట రాజు 86%, వేణుగోపాల్ 85%, కావలి గ్రీష్మ 85%, దుర్గాప్రసాద్ 84%, శశి 84%, వెంకట నరసింహా 24%, రాధాకృష్ణ 83%, శివకుమార్ 83%, అప్పలనాయుడు 81%, టీజీ భరత్ 76.9%, ఖాదర్ బాషా 72 శాతం తెచ్చుకున్నారు.

ఇక, ఐవీఆర్ఎస్ లో కొల్లు రవీంద్ర 70 %, వెంకటరాజు 68%, వెంకట నరసింహ 66%, వేణుగోపాల్ 67%, రవి నాయుడు 69%, ఈశ్వర్ రెడ్డి 65%, దుర్గాప్రసాద్ 65% బాగా మాట్లాడారని ప్రజలు అభిప్రాయపడ్డారని చెప్పారు. గతంలో మాదిరిగా 10 గంటల వరకు మహానాడు సమావేశాలు పెట్టడం లేదని, సమయపాలన పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎక్కువ సమయం మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తే గంట కొట్టడం, అప్పటికీ ఆపకుంటే మైక్ కట్ చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. ఏదేమైనా ప్రసంగాలకు కూడా అభిప్రాయ సేకరణ చేస్తూ, ర్యాంకులిస్తూ చంద్రబాబు తన మార్క్ పాలిటిక్స్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.