అవును అధికార పార్టీలో ఉంటే అసలు ఎదురే ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అధికారపార్టీలో ఉన్నంత మాత్రాన అందరికీ పనులు జరగవు అనుందకు మాగుంట శ్రీనివాసుల రెడ్డే తాజా ఉదాహరణగా నిలుస్తున్నారట. నిజానికి జిల్లాలోని చాలాకొద్ది మంది సీనియర్ నేతల్లో మాగుంట కూడా ఒకరు. ఇప్పటికి నాలుగుసార్లు ఒంగోలు ఎంపిగా ఓసారి ఎంఎల్సీగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మూడుసార్లు గెలిచిన మాగుంట తాజాగా వైసీపీ తరపున గెలిచారు. మధ్యలో టీడీపీ తరపున ఎంఎల్సీ గా కూడా గెలిచారు.
ఇంత సీనియారిటి ఉండి, పలుకుబడి కూడా ఉండి ఏమీ ఉపయోగం లేకపోతోందని ఎంపి మదనపడిపోతున్నారట. కారణం ఏమిటయ్యా అంటే తన మద్దతుదారుల్లో ఎవరికీ ఏ పదవినీ ఇప్పించ లేకపోతున్నారట. టీడీపీ హయాంలో ఎంపిగా ఓడిపోయిన మాగుంటకు ఎంఎల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే ఐదేళ్ళు టీడీపీ నేతగా గౌరవ, మర్యాదలకు ఎటువంటి లోటు లేకపోయినా ఒక్క పనీ కాలేదట. తనను నమ్ముకున్న మద్దతుదారుల్లో ఏ ఒక్కరికీ గట్టి పదవి ఇప్పించుకోలేకపోయారట.
సరే వైసీపీలోకి జంపు చేసిన తర్వాత ఎంపిగా గెలిచారు. ఇక్కడైనా తన మద్దతుదారులకు పదవులు ఇప్పించుకుందామంటే ఇక్కడా సాధ్యం కావటం లేదట. మంత్రులతో మాట్లాడుదామంటే వాళ్ళు కూడా పలకటం లేదట. పదవుల కోసం ఒకవైపేమో మద్దతుదారుల ఒత్తిడి, మరోవైపేమో మాట చెల్లుబాటు కాకపోవటం. దీంతో ఎంపికి ఏమి చేయాలో అర్ధం కావటం లేదని సమాచారం. అదే కాంగ్రెస్ హయంలో అయితే ఎంపి మాట చెప్పింది చెప్పినట్లుగా అయిపోయేదట. ఏమి చేస్తారు గత వైభవాన్ని తలచుకుని ఏదో కాలం నెట్టుకొచ్చేస్తున్నారట.
అయితే ఇలా ఎంత కాలం అన్నదే అసలైన సమస్య. పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా తనకంటు ఓ క్యాడర్ ను మెయిన్ టైం చేయటమే అసలైన సమస్య అయిపోయిందట ఎంపికి. పార్టీలోని నేతలంటే ఓ నలుగురు మద్దతుగా నిలిచే అవకాశం ఉండేది. కానీ మాగుంట వెంటుండే వారంతా పార్టీతో సంబంధం లేని సొంత క్యాడరట. అంటే ఈ సొంత క్యాడర్ తో పార్టీలోని మిగిలిన నేతలకు ఏమీ సంబంధం ఉండదు. అందుకే తమకు సంబంధం లేని నేతలకు తామెందుకు మద్దతుగా నిలవాలన్నదే మిగిలిన నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఇదే మాగుంటకు ఇఫుడు పెద్ద సమస్యగా మారిపోయింది. మరి పెరిగిపోతున్న సమస్యతో మాగుంట ఏమి చేస్తారన్నది ఆసక్తిగా మారింది.