రాజకీయాలు ఇప్పుడున్నట్టు రేపు ఉండవు. నిన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉండవు. ఎంత ప్రత్యర్థులైనా.. కేవలం ఎన్నికల వరకు.. మాత్రమే పరిమితం కావాలి. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అనేక మంది ఇదే సూత్రాన్ని పాటించారు. అమలు చేశారు. ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఈ విషయంలో ఆదర్శం. మరి అలాంటి గడ్డ పై రాజకీయాలు చేసే నాయకులు ఎలా ఉన్నారు? అంటే.. ప్రశ్నార్థకమే.
ఐదు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారంటే.. సదరు నాయకుడు ఇంకా మంచి లక్షణాలతోనే ముందుకు సాగాలి. పైగా.. సంస్కారవంతమైన ఫ్యామిలీలో ఎలాంటి మచ్చలు మరకలు లేని కుటుంబం నుంచి వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటివారు.. మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందు కంటే.. ఆయన ఇప్పుడు జోరుగా ట్రోల్ అవుతున్నారు. “సోమిరెడ్డిని పంపిస్తానని.. కాకాణి వెళ్లారు” అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం.. 2022లో టీడీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కాకాణి చేసిన వ్యాఖ్యలే. అప్పట్లో సోమిరెడ్డిని జైలుకు పంపిస్తానంటూ… కాకాణి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జైలుకే పంపిస్తానని.. కుటుంబానికి చేరువగానే ఉంచుతానని.. తన కుమారుడు రోజూ వచ్చి చూసుకునే వీలు కల్పిస్తానని కూడా ఎద్దేవా చేశారు. వీటిని ఆనాడు సోమిరెడ్డి సవాల్ చేశారు. దమ్ముంటే పంపించు అని కూడా అన్నారు. కానీ.. ఎక్కడా సోమిరెడ్డి దొరకలేదు.
కట్ చేస్తే.. మూడేళ్లు కూడా తిరగకుండానే.. సోమిరెడ్డిని పంపిస్తానని చెప్పిన జైలుకే తాజాగా సోమవారం రాత్రి కాకాణి వెళ్లాల్సి వచ్చింది. గనుల అక్రమ తవ్వకాలు, ఎస్సీఎస్టీల కేసులో సుదీర్ఘ కాలం పరారీలో ఉన్న కాకాణి అరెస్టుకావడంతో ఆయనకు రిమాండ్ విధిస్తూ.. స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాకాణి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిని చూసిన వారు.. పైవిధంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, “కాల మహిమ అంటే ఇదే!” అని పరిశీలకులు అంటున్నారు.