కేసీఆర్ ఆత్మ‌తో క‌విత‌ భేటీ… రాయ‌బారమేనా?

బీఆర్ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత పార్టీ అధినేత‌.. త‌న తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సూచ‌న‌లు చేస్తూ.. రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీని పై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చ‌ర్చ‌సాగింది. ఇక‌, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అస‌లు ఈ లేఖ‌పై ఎవ‌రూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పిన‌ట్టు కూడా స‌మాచారం. దీంతో అప్ప‌టి నుంచి ఈ లేఖ వ్య‌వ‌హారంపై ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

కాగా.. క‌విత లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చి(రాసి చాలా రోజులే అయింద‌ని స‌మాచారం).. మూడు రోజులు అయినా.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సంప్ర‌దింపులు.. పిలుపులు లేక‌పోవ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత చ‌ర్చ‌సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా సోమ‌వారం సాయంత్రం 6-7 గంట‌ల స‌మ‌యంలో క‌విత నివాసానికి తెలంగాణ తొలిద‌శ ఉద్య‌మ కారుడు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ‌ స‌భ్యుడు, బీఆర్ఎస్ నేత‌.. దీవ‌కొండ దామోద‌ర్‌రావు వ‌చ్చారు. ఆయ‌న వెంట సీనియ‌ర్ న్యాయ‌వాది కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. కేసీఆరే దామోద‌ర్‌రావును, న్యాయ‌వాదిని క‌విత వ‌ద్ద‌కుపంపించారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోద‌ర్‌రావు.. పార్టీ ప‌రంగానే కాకుండా.. ప‌త్రిక న‌మస్తే తెలంగాణ ప‌రంగా కూడా చేరువ‌. ప‌త్రిక‌ను స్థాపించింది కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే. ఇక‌, ఆ త‌ర్వాత కేసీఆర్ ఆశీస్సుల‌తోనే 2022లో రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టారు. దీంతోనే ఆయ‌న‌ను `కేసీఆర్ ఆత్మ‌గా’ సొంత మీడియాలో పిలుస్తారు.

సో.. కేసీఆర్‌కు స‌న్నిహితుడుగా.. ఆయ‌న‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న దామోద‌ర్‌రావు ఇప్పుడు క‌విత‌ను క‌లుసుకునేందుకు రావ‌డం.. ఆశ్చ‌ర్యంగాను.. ఆస‌క్తిగాను మారింది. ఈయ‌న వెంట న్యాయ‌వాది కూడా ఉండ‌డంతో ఏదో తేల్చుకునే ప‌నిలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి చివ‌ర‌కు రాజీ ధోర‌ణికి వ‌స్తారా? లేక‌.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ఇంకా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మారింది.