వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది. ఈ నెల తొలి వారంలో ఆయన విజయవాడకు వచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో రూ.3200 కోట్ల మేరకు అవినీతి జరిగిందని.. ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. ఈ విచారణకే సిట్ అధికారులు పంపిన నోటీసుల మేరకు.. సాయిరెడ్డి ఈ నెల తొలి వారంలో విజయవాడకు వచ్చారు.
అయితే.. ఇలా విజయవాడకు రావడం ముందు.. ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు, టీడీ జనార్ధన్‌తో భేటీ అయ్యారన్నది ఇప్పుడు వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీనిని బట్టి టీడీపీతో సాయిరెడ్డికి సంబంధం ఉన్న మాట వాస్తవమేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల జగన్ కూడా.. సాయిరెడ్డి టీడీపీకి అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సీటును కూడా అమ్మేసుకున్నారని అన్నారు.
ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి.. టీడీపీకి అమ్ముడు పోయారని చెప్పడానికి దీనికంటే ఉదాహరణ ఇంకేం కావాలంటూ.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి.. సాయిరెడ్డి వైసీపీని విడిచి పెట్టారు. పార్టీపై ఆయన ఎలాంటి కామెంట్లు కూడా చేయలేదు. అంతేకాదు.. పార్టీకి రాజీనామా చేయడంతోపాటు.. తన రాజ్యసీటు కూడా రాజీనామా చేశారు. ఇంత జరిగిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఉంటారో.. వ్యవసాయం చేసుకుంటారో అనేది ఆయన వ్యక్తిగతం.
పోనీ.. ఒకవేళ.. ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా.. తప్పులేదు కదా! లేదు.. రాజకీయాల్లో ఉండనని వ్యవసాయం చేసుకుంటానని అంటే మాత్రం ఏమవుతుంది. ఏమీ జరగదు. పైగా.. ఆయన నిబద్ధతను చాటుకున్నారు. పార్టీని బ్లేమ్ చేయలేదు. రాజీనామా విషయంలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. అలాంటి సమయంలో ఆయన ఎవరితో కలవాలి.. ఎవరితో ఉండాలి.. ? అనే విషయాలపై వైసీపీ నిర్ణయించలేదు కదా! కాబట్టి.. సాయిరెడ్డి నిజంగానే టీడీ జనార్దన్‌తో కలిసినా.. తప్పేంటి? అనేది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల మాట. దీనిని మరింత తవ్వి తే వైసీపీకే మంచిది కాదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates