భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిలబెడతానంటూ.. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి ఆయన ఐదేళ్ల వరకు సమయం విధించుకున్నారు. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా ఓ అడుగు ముందుకు పడింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఒక మెట్టు జంప్ చేసింది.
ప్రస్తుతం నాలుగో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ను తోసిపుచ్చి.. ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం వెల్లడించారు. జపాన్ ప్రస్తుతం నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని.. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుందని వివరించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని.. దీంతో జపాన్‌ను అధిగమించామని ఆయన వివరించారు.
ఇక, ప్రపంచ వ్యాప్తంగా తొలి ఐదు స్థానాల్లో ఉన్న కీలక ఆర్థిక దేశాలు..
1) అమెరికా
2) చైనా
3) జర్మనీ
4) భారత్(ఇప్పటి వరకు ఐదోస్థానంలో ఉండేది)
5) జపాన్
ఏంటి కారణం?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనంతరం.. ఆర్థికంగా దేశాలు దెబ్బతిన్నాయి. కానీ, భారత్ నిలదొక్కుకుంది. అదేవిధంగా పలు దేశాలు యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. కానీ, శాంతి మంత్రాన్ని జపిస్తున్న భారత్ యుద్ధానికి కడుదూరంలో ఉంది. అదేసమయంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిని చేరిందని సుబ్రహ్మణ్యం వెల్లడించారు.