భాగ్యనగరం హైదరాబాద్‌లో జరుగుతున్న 74వ ప్రపంచ అందాల సుందరుల(మిస్ వరల్డ్) పోటీలు కొనసాగుతున్నాయి. అంగ రంగ వైభవంగా సాగుతున్న ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఈ పోటీలకు వచ్చిన సుందరాంగులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆహూతులకు ఆనందాన్ని పంచుతున్నా రు. అదేసమయంలో పోటీని కూడా రసరమ్యం చేస్తున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఈ పోటీలకు ప్రత్యేక భద్రతను కల్పించింది. ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది.
ఇలా సాగుతున్న ఈ పోటీల్లో అనూహ్యమైన ఆరోపణలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల వయసున్న మిస్ ఇంగ్లాండ్
మిల్లా మాగీ.. సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరో వారంలో ఫైనల్ పోటీ ఉందనగా ఆమె అనూహ్యంగా ఈ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. వెంటనే తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు అధికారికంగా కూడా వెల్లడించింది. సరే.. దీని వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె తాజాగా కీలక ఆరోపణలు చేస్తూ.. అందుకే నేను పోటీ నుంచి తప్పుకొన్నానని వెల్లడించడం సంచలనంగా మారింది.
ఇంగ్లండ్ సుందరి మిల్లా చెప్పి కారణాలు ఇవీ..
- ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వారిని ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండమని ఒత్తిడి చేస్తున్నారు.
- కనీసం బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో కూడా మేకప్ తీసేందుకు ఒప్పుకోవడం లేదు.
- కొన్ని సందర్భాల్లో
నైట్
డ్రెస్సులతోనే ఉండాల్సి వస్తోంది. - సాయంత్రం నిర్వహించే కార్యక్రమాల్లో
మేల్ స్పాన్సర్ల
తోరాసుకుని.. పూసుకుని
కూర్చోమంటున్నారు. - గ్రాండ్ అతిథులను ముద్దు చేయమని, అలరించమని ఒత్తిడి చేస్తున్నారు.
- ఒకరకంగా వేశ్యలుగా చూస్తున్నారు. ఇది సరికాదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అని.. మిల్లా మాగీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రపంచ సుందరుల కాంటెస్ట్‌లో ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలు ఉన్నా.. తెరచాటుకే పరిమితమయ్యాయి. కానీ, తొలిసారి బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం.. ముఖ్యంగా మహిళా సమాజం స్పందించే తీరును బట్టి పోటీలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా.. పోటీలు రద్దయినా ఆశ్చర్యం లేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.