కేటీఆర్ చెప్పేశాడు…లాక్ డౌన్ ఖేల్ ఖ‌తం

తెలంగాణ‌లో లాక్ డౌన్ విష‌యంలో ప్ర‌భుత్వం ఏం చేయ‌నుంది? గ‌తంలో కేంద్రంతో విబేధించి లాక్ డౌన్ కొన‌సాగించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారు మే 7వ తేదీ త‌ర్వాత కూడా అదే రీతిలో సొంతంగా ముందుకు సాగ‌నుందా? అనే ఆస‌క్తి, ఉత్కంఠ స‌ర్వాత్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ త‌రుణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మే 8 నాటికి తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా మారగలదని కేటీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో, లాక్ డౌన్ ఎత్తేస్తార‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 40 రోజులుగా లాక్ డౌన్ నడుస్తోంది. ఎక్కడివాళ్లక్కడే ఉండ‌గా అన్ని వ్యాపారాలూ బంద్ అయిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన గడువు మరో ఏడు రోజులు ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంది? మే 7వ తేదీ తర్వాత లాక్ డౌన్ సడలింపులు ఇస్తారా? ఇంకా కొనసాగిస్తారా అన్న దానిపై అప్పుడే టెన్షన్ మొదలైంది.

ఈ నేప‌థ్యంలో ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ మాట్లాడుతూ చేసిన వ్యాక్య‌లు చ‌ర్చ‌కు దారితీశాయి. బుధ‌వారం నాటికి గ‌త మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఫ్రీ జిల్లాలు 11 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారందరూ అప్పటికి డిశ్చార్జి అవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. దీంతో లాక్ డౌన్ ఎత్తేసేందుకు కేసీర్ స‌ర్కారు సిద్ధంగా ఉంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

కాగా, తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్నవారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. కంటైన్మెంట్‌, క్వారంటైన్‌, రెడ్‌ జోన్లను సమర్ధంగా అమలుపరుస్తున్నామని చెప్పారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జీవితంతోపాటు జీతం ముఖ్యమని, ప్రజలకు అత్యవసరమైన సేవలు అందించడానికి అవసరమైన పరిశ్రమలను నడిపిస్తున్నామని, దీనిద్వారా కొందరికి ఉపాధి కూడా దొరుకుతున్నదని చెప్పారు.