భారత్ లో ఆపిల్‌.. ఈసారి సుంకం హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఆపిల్‌పై మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇతర దేశాల్లో తయారు చేయడం తాము సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నందుకు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు తన అభిప్రాయం చెప్పినట్లు తెలిపారు.

అలాగే ఆపిల్ కూడా ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. భారత్ లో ఎప్పటిలానే తన ప్రణాళికలు కొనసాగిస్తున్న క్రమంలో ట్రంప్ మరోసారి దూకుడు పెంచారు. ‘‘అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారవ్వాలి. మీరు భారత్‌లో తయారు చేస్తే కనీసం 25 శాతం సుంకం చెల్లించాలి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఆపిల్ షేర్లు 3% వరకు పడిపోయాయి. 

ఇదే సమయంలో భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్న ఆపిల్‌కు ఇది ఊహించని షాక్‌గా మారింది. ట్రంప్ వ్యాఖ్యలకు నేపథ్యం ఉంది. గతంలో ఆయన చైనాపై భారీ టారిఫ్‌లు విధించడంతో, ఆపిల్ సరఫరా వ్యవస్థను భారత్‌ వంటి దేశాలకు మార్చడం ప్రారంభించింది. ఫాక్స్‌కాన్, టాటా గ్రూప్, పెగాట్రాన్ వంటి కంపెనీలు తమిళనాడులో భారీగా ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్నాయి. 2023-24లో మాత్రమే భారత్‌లో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఆపిల్ తయారు చేసింది.

అయితే ఇప్పుడు ట్రంప్ తిరిగి ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘నాకు భారత్‌లో తయారీ ఇష్టం లేదు. ఇది అమెరికా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలోనే ఉత్పత్తి జరగాలి’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. తమ మధ్య చర్చల అనంతరం టిమ్ కుక్ కూడా అమెరికాలో ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికలు ఆపిల్ వ్యూహాల్లో మార్పుకు దారి తీసే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారత్‌ను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ఆపిల్‌కు ఇది పెద్ద సవాలుగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ట్రంప్ ఒత్తిడికి ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.