ఇంత జ‌రుగుతున్నా.. అడ్ర‌స్ లేని ‘ధ‌ర్మాన’ బ్ర‌ద‌ర్స్ ..!

ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీలో ఇదే చ‌ర్చ సాగుతోంది. వైసీపీ హ‌యాంలో మంత్రులుగా ప‌నిచేశారు. వీరిలో ఒక‌రు ఉప ముఖ్య‌మంత్రిగా కూడా చేశారు. కానీ.. పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వారి వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. అస‌లు పార్టీ నుంచే కాకుండా.. రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కంటే కూడా.. కృష్ణ‌దాస్‌కు వైఎస్ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది. ఈయ‌న వైఎస్ మ‌ర‌ణం నుంచే ఆ కుటుంబానికి అండ‌గా ఉన్నారు.ఈ క్ర‌మంలోనే పార్టీ అధికారం లోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత రెండున్న‌రేళ్ల‌కు మారిన మంత్రి వ‌ర్గంలో ధ‌ర్మాన కుటుంబానికి ప్రాధాన్యం త‌గ్గించకుండా.. ప్ర‌సాద‌రావుకు జ‌గ‌న్ మంత్రి పీఠం ఇచ్చారు. ఇది సంచ‌ల‌న‌మేన‌ని అప్ప‌ట్లో చ‌ర్చ సాగింది.

ఇలా.. ధ‌ర్మాన కుటుంబానికి జ‌గ‌న్ ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వారిద్ద‌రు సోద‌రులు కూడా.. పార్టీ అధికారం పోయిన త‌ర్వాత‌.. ఎక్క‌డివారు అక్క‌డే మౌనంగా ఉండిపోయారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా చేరువ కాలేక పోతున్నారు. పైగా.. ఎక్క‌డా వారి వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. ఇది పార్టీలోనే కాదు.. రాజ‌కీయంగా కూడా ధ‌ర్మాన సోద‌రుల చుట్టూ వివాదంగా మారింది. పార్టీ అధికారంలో ఉంటే ప‌ద‌వులు అనుభ‌వించి.. తాజాగా ఇలా చేయ‌డం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్త‌వం. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతిని వెలికి తీస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి వారు భ‌య‌ప‌డుతున్నారా? అనేది ప్ర‌శ్న‌. త‌మ హ‌యాంలో జ‌రిగిన అవినీతిని కూడా వెలికి తీస్తే.. అప్పుడు తాము కూడా జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా? అనేది ప్ర‌శ్న‌. అయితే.. దీనిపైనా వారు స్పందించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌సాద‌రావుకు మేధావి వ‌ర్గల్లో మంచి పేరుంది. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే.. పార్టీకి ఒకింత ఉప‌శ‌మ‌నం ద‌క్క‌తుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది. కానీ, ఆయ‌న మాత్రం మౌనంగా ఉంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.