తెలుగు నేల రాజకీయాల్లో గురువారం ఓ హాట్ టాపిక్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఓ సుదీర్ఘ లేఖ సంధించారు. దాదాపుగా 6 పేజీలతో కూడిన ఈ లేఖ ఇటీవలే వరంగల్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాతే రాసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇతమిద్ధంగా ఎప్పుడు ఆమె తన తండ్రికి ఈ లేఖ రాశారన్న విషయం మాత్రం తెలియ రాలేదు.
మై డియర్ డాడీ… అంటూ మొదలుపెట్టిన కవిత… వరంగల్ సభా వేదిక మీద పార్టీ సరైన చర్యలే తీసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ మోస్ట్ నేతలకు కూడా కనీసం వేదిక మీద చోటు ఇవ్వలేకపోయారని కూడా ఆమె ఆక్షేపించారు. కనీసం కొందరు సీనియర్ మోస్ట్ నేతలతో అయినా మాట్లాడించాల్సి ఉండిందని కూడా ఆమె అభిప్రాయపడ్దారు. ఈ సభలో సీనియర్ల మాటల్లేకుండా నేరుగా కేసీఆర్ ప్రసంగంతోనే సభను ముగించిన తీరును ఆమె తప్పుబట్టారు.
వరంగల్ లో నిర్వహించిన సభ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ కదా. అదే అంశాన్ని గుర్తు చేసిన కవిత… సిల్వర్ జూబ్లీ సభా వేదిక మీద నుంచి కేసీఆర్ నుంచి మరింత మంచి ప్రసంగాన్ని జనం ఆశించారని అన్నారు. అయితే ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని ఆమె పేర్కొన్నారు. చాలా కీలక అంశాలను సభా వేదికపై నుంచి ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తావించలేకపోయారని… ఫలితంగా సభ ముఖ్య ఉద్దేశ్యం ఫలించలేదని ఆమె అన్నారు.
ఇక చివరగా అయినా కూడా చాలా కీలకమైన అంశాన్ని కవిత ప్రస్తావించారు. వరంగల్ సభా వేదిక మీద నుంచి ప్రసంగించిన కేసీఆర్…కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ మీద కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, ఇది బీఆర్ఎస్ పై లెక్కలేనన్ని అనుమానాలను క్రియేట్ చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మీద మీకు ఎందుకంత సాఫ్ట్ కార్నార్?.. నన్ను బీజేపీ చాలా ఇబ్బంది పెట్టింది డాడీ అంటూ కవిత ఆ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంత చేసినా కూడా ఆ పార్టీని పెద్దగా టార్గెట్ చేయకుండానే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఈ లేఖ తెలుగు నేల రాజకీయాల్లో తెగ వైరల్ అవుతోంది.