-->

కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది?

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలనను చేపట్టి అప్పుడే ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తాము చేసిందేమిటి? సాధించిన ప్రగతి ఏమిటి? ఇంకా చేపట్టాల్సిన చర్యలేమిటి? అన్న వాటిపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్ష ఓకే గానీ… చంద్రబాబు ఏడాది పాలనలో రైతాంగం ఎలా ఉంది? అన్న విషయాన్ని పరిశీలిస్తే… చాలా ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.

కూటమి పాలన చేపట్టాక తొలుత ఖరీఫ్, ఆ తర్వాత రబీ…ఒక ఏడాదిలో వచ్చే రెండు పంట సీజన్లు ముగిశాయి. వచ్చే నెల నుంచి రెండో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. మరి ఇది వరకే ముగిసిన ఖరీఫ్ గానీ, రబీ సీజన్లలో రైతుల పరిస్థితి ఏమిటి? అంటే… కూటమి పాలనలో రాష్ట్ర రైతాంగం ఫుల్ హ్యాపీ అని చెప్పక తప్పదు. సమృద్దిగా వర్షాలు, పొలాల నిండా పంటలు, అన్నింటికీ కాకున్నా మెజారిటీ పంటలన్నింటికీ మంచి గిట్టుబాటు ధరలు లబించాయనే చెప్పాలి.

ధాన్యం విషయానికే వస్తే… అటు ఖరీఫ్ లో గానీ, ఇటు రబీలో గానీ… ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆ ధాన్యం సొమ్ములను సకాలంలోనే నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఇతర పంటల పరిస్థితి కూడా ఇదే రీతిన సాగింది. ఈ రబీలో పండిన మిర్చి ఒక్కటి మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ప్రభుత్వం అంతగా సాయం చేయలేకపోయినా… చేయాల్సినదంతా చేసిందనే చెప్పక తప్పదు.

ఇక ఎక్కడైనా సాగు గురించి ఆలోచిస్తే… వర్షాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గత ఖరీఫ్, రబీలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలన్నీ పండి, కోతలు పూర్తి అయి, కొనుగోళ్లు కూడా పూర్తి అయిన తర్వాతే వర్షాలు మొదలయ్యాయి. ఇది మంచి సంకేతమని చెప్పక తప్పదు ఖరీఫ్ కు సరైన స్వాగతమని చెప్పాలి. ఇక ఆక్వా రంగానికి వస్తే… అంతర్జాతీయంగా ఎదురైన పరిణామాలను తట్టుకుని నిలబడేలా ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతను ఇచ్చింది. ఫలితంగా ఇతర రంగాల మాదిరే ఇప్పుడు ఆక్వా రైతులు కూడా మంచి లాభాలనే సంపాదిస్తున్నారు.