వైసీపీ కీలక నాయకుడు, గత ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి సంగతి తేల్చేందుకు సర్కారు సిద్ధమైంది. కడప జిల్లా సీకే దిన్నెమండలం పరిధిలోని అటవీ భూముల్లో 55 ఎకరాలను ఆక్రమించి.. సజ్జల ఎస్టేట్
నిర్మించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్నాళ్ళ కిందటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నియమించిన రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల బృందం సజ్జల ఎస్టేట్‌లో పర్యటించి.. నిజానిజాలే తేల్చింది.
భూములు ఆక్రమించిన మాట వాస్తవమేనని అధికారుల బృందం నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల ఆక్రమిక భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తాజాగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సంబంధిత భూములను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయడంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీంతో గురువారం సజ్జల ఆక్రమిత అటవీ భూమి 55 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు.
ఇక్కడితో ఆగదు!
ఇక, సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమణల వ్యవహారం కేవలం సదరు ఆక్రమిక భూములను స్వాధీనం చేసుకోవడంతోనే ఆగబోదని అధికారులు చెబుతున్నారు. దీని వెనుక అప్పట్లో పనిచేసిన అధికారులు సహా.. అందరి పైనా అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. అలానే సజ్జల కుటుంబ సభ్యులపై కూడా.. కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. ఆక్రమిత భూమిలో ఉన్న చెట్లను నరికి వేయడం.. అటవీ సంపదకు నష్టం కలిగించడం పైనా పరిహారం వసూలు చేసే అవకాశంతోపాటు కేసు నమోదు చేసి.. జైలుకు తరలించే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో సజ్జల సంగతి తేల నుంచి అంటున్నారు.