జగన్ జైలుకెళ్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో విచారణ వేగవంతం చేయాలని టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక, జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జైలుకు వెళితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని ప్రత్తిపాటి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.‌

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, రాష్ట్రం బాగుపడాలని కోరుకునే వారంతా జగన్ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిలకలూరిపేటలో కూటమి పార్టీల శ్రేణులపై ఈగ వాలకుండా చూస్తున్నానని చెప్పారు. కూటమి పార్టీలోని ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచేలా పనిచేస్తానని, అదే తన లక్ష్యమని అన్నారు.

కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని హితవు పలికారు. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతానంటే వారిని చేర్చుకోవాలని సూచించారు. ఓడిపోతానని తెలిసే విడదల రజనీ చిలకలూరిపేటలో పోటీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ రజనీ పోటీ చేసి ఉంటే టీడీపీకి లక్షల్లో మెజారిటీ వచ్చేదని అన్నారు.