=

కేబినెట్ లో ‘లిక్కర్’పై సుదీర్ఘ చర్చ.. ఏం జరుగుతోంది?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే లెక్కలేనన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే… ఈ సంచలనాలను మించిన సంచలన ఘటనలు త్వరలోనే చెటుచేసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి లో జరిగిన కేబినెట్ భేటీలో లిక్కర్ స్కాంపై సుధీర్ఘ చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా మంత్రులంతా పాలుపంచుకున్న ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా హాజరయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్దేశిత షెడ్యూల్ ముగిసిన తర్వాత కేబినెట్ లో లిక్కర్ స్కాం అంశాన్ని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎవరెవరిని అరెస్టు చేశారు? ఏఏ ఆధారాలను సేకరించారు? ఎంతమేర అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రజలకు గానీ నష్టం జరిగింది? ప్రస్తుతం ఈ కేసు పరిస్థితి ఏమిటి? మున్ముందు ఈ కేసులో తీసుకోబోయే చర్యలు ఎలా ఉండనున్నాయి? అన్న అంశాలపై డీజీపీ కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. అదే సమయంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం లిక్కర్ స్కాంపై మాట్లాడిన చంద్రబాబు… ఇకపై మద్యం కుంభకోణం గురించి మంత్రులెవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఈ కేసు నీరు గారకుండా… పక్కదారి పట్టకుండా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు కూడా దర్యాప్తు జరుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన మద్యం కుంభకోణంపై విచారణ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తు పారదర్శకతపై ఏ ఒక్కరికి కూడా అనుమానాలు ఉండని రీతిలో చర్యలు చేపడుతున్నామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని చంద్రబాబు… ఈ కేసులో తప్పు చేసిన వారు ఎవరైనా అరెస్టు అయి తీరాల్సిందేనని ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అరెస్టు కావడమే కాకుండా విచారణలో సదరు వ్యక్తులకు ఏమాత్రం ప్రమేయం ఉందని తేలినా… ఆ మేరకు వారిపై చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా లిక్కర్ స్కాంలో ఇప్పటిదాకా జరిగిన అరెస్టుల కంటే కూడా మరిన్నికీలక అరెస్టులు, మరింత మంది కీలక వ్యక్తులు అరెస్టు కాక తప్పదన్న మాటను చంద్రబాబు పరోక్షంగా వినిపించినట్టు అయ్యింది. మొత్తంగా కేబినెట్ లో లిక్కర్ స్కాంపై చర్చ ద్వారా వైసీపీ ఒక్కసారిగా హైరానా మొదలైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.