కాకతాళీయమో, మరేమిటో తెలయదు గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల నోట మంగళవారం ఒకే మాట వినిపించింది. ఈ మాట ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే చాలా సార్లు వినియోగించినా…మంగళవారం మాత్రం వీరిద్దరూ ఒకేసారి ఈ మాటను ప్రయోగించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరెగెత్తేలా చేశారు. బాబు కామెంట్ వైసీపీ శిబిరంలో కలకలం రేపితే… జగన్ కామెంట్ మాత్రం ఏదో రొటీన్ కామెంట్ లానే అలా తుస్సుమంది. అయితే ఆ కామెంట్ వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఒకింత ఉత్సాహాన్ని అయితే నింపింది.
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెగ్యులర్ అజెండా ముగిసిన తర్వాత రాష్ట్రంలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంపై సుదీర్ఘ చర్చే జరిగింది. ఈ సందర్భంగా మద్యం కుంభకోణంపై తనదైన మార్గదర్శకాలు జారీ చేసిన చంద్రబాబు.. లిక్కర్ స్కాంపై మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అనంతరం ఈ కేసుపై ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు… ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
దాదాపుగా ఏపీ కేబినెట్ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన స్థానికసంస్థల ప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కారు అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ శ్రేణులు కూడా అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న జగన్… మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ సర్కారు వచ్చాక… ఇప్పుడు వైసీపీ శ్రేణులపై దాష్టీకాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. కూటమి అధికారాన్ని అండగా చేసుకుని అరాకచకాల చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్న జగన్… తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.