=

జైల్లో ఉండ‌లేను.. బెయిలివ్వండి: గాలి

క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ప్రస్తుతం చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 2009 – 10 మ‌ధ్య క‌ర్ణాట‌క‌-అనంత‌పురం మ‌ధ్య ఉన్న ఓబులాపురం గ‌నుల ను అనుమ‌తికి మించి దోచుకున్నార‌న్న కేసులో ఇటీవ‌ల సీబీఐ కోర్టు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌హా.. ఆయ‌న బావ‌.. ఐఆర్ ఎస్ అధికారి బీవీ శ్రీనివాస‌రెడ్డి, అదేవిధంగా రాజ‌గోపాల్ రెడ్డి, అలీఖాన్‌ల‌కు ఏడేళ్ల‌పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు.. చంచ‌ల గూడ జైలుకు త‌ర‌లించారు.

ఇది జ‌రిగి సుమారు వారం అయింది. అయితే.. ఇంత‌లోనే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌హా.. మిగిలిన వారు.. తెలం గాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. జైలు జీవితం గ‌డ‌ప‌లేక పోతున్నామ‌ని.. వ‌య‌సు రీత్యా అయినా.. త‌మ‌ను కరుణించాల‌ని వారు వేడుకున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో గాలి స‌హా .. మిగి లిన దోషులు ప‌లు కీల‌క విష‌యాల‌తో కోర్టును బెయిల్ కోసం అభ్య‌ర్థించారు. వ‌య‌సు, త‌మ వ్యాపారాలు, కుటుంబాలు స‌హా.. ఆరోగ్య అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వ‌య‌సు రీత్యా వ‌చ్చిన బీపీ, షుగ‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నాను. నాపై చేసిన అభియోగాల‌కు ఆధారాలు లేవు. గ‌తంలో విచారించిన‌ప్పుడు కూడా.. ఎలాంటి ఆధారాల‌ను ప్ర‌వేశ పెట్ట‌లేదు. అందుకే గ‌తంలో బెయి ల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు క‌దా.. అని నేనేమీ త‌ప్పు చేయ‌లేదు. కోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించ‌లేదు. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేయండి.. ఎలాంటి నిబంధ‌న‌లు విధించినా.. క‌ట్టుబ‌డి ఉంటాం అని గాలి త‌ర‌పున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.

ఇక‌, ఇత‌రుల త‌ర‌ఫున కూడా దాదాపు ఇదే విధంగా పిటిష‌న్లు వేశారు. వారి త‌ర‌ఫున న్యాయ‌వాదులు కూడా వాద‌న‌లు వినిపించ‌నున్నారు. అయితే.. ప్ర‌స్తుతం చంచ‌ల్‌గూడ జైల్లో ఉన్న గాలి, ఇత‌ర దోషుల‌కు బెయి ల్ ఇవ్వరాద‌ని.. వారు చేసిన నేరాలు రుజువ‌య్యాయ‌ని సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాదులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. గ‌నుల కుంభ‌కోణంలో సుమారు 1200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారిన‌ట్టు అధికారులు పేర్కొన్న విష‌యం తెలిసిందే.