“మీ చొరవ అద్భుతం. మీలాంటి నాయకుడిని నేను మునుపెన్నడూ చూడలేదు. వయసుతో సంబంధం లేకుండా.. నిత్య కృషీవలునిగా మీరు చేస్తున్న అలుపెరుగని కృషి నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. మీతో కలిసే అవకాశం నాకు రావడం చాలా సంతోషం. ఆ మధుర స్మృతులు నన్ను ఇప్పటికీ సంతోషానికి గురి చేస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి.. నేను తప్పకుండా ఇతోధికంగా దోహద పడగలనని హామీ ఇస్తున్నా”- అని ఏపీ సీఎం చంద్రబాబును మైక్రోసాఫ్ట్ దిగ్గజం, ప్రపంచ వ్యాపార వేత్త బిల్ గేట్స్ ఆకాశానికి ఎత్తేశారు.
ఈ మేరకు గేట్స్ తాజాగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రెండు మాసాల కిందట భారత్‌కు వచ్చిన బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనను అమరావతికి కూడా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో ఎలా నిర్మిస్తున్నదీ ఆయనకు వివరించారు. అప్పట్లోనే ఢిల్లీలోని బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ సమావేశంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గేట్స్ అంగీకరించారు.
తర్వాత చాన్నాళ్లకు.. తాజాగా గేట్స్ నుంచే చంద్రబాబుకు లేఖ అందింది. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్‌తో జరిగిన ఒప్పంద సమావే శాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు. ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదలకు విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు కృషిని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఎవరూ ఊహించని రీతిలో నిత్యం 18 గంటలకు పైగా పనిచేస్తూ..రాష్ట్రం కోసం.. ప్రజల కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. మున్ముందు కూడా.. చంద్రబాబు ఇలానే పనిచేయాలని రాష్ట్రాన్ని, దేశాన్ని అద్భుతంగా మలచాలని కోరుకుంటున్నట్టు బిల్ గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే ప్రతినిధి బంధం ఏపీలో పర్యటిస్తుందని కూడా ఆయన వివరించారు.