కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సంచలన ప్రకటన చేశారు. 24 గంటల్లో విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో 24 గంటల తర్వాత కూడా.. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే.. తానే ఆమరణ దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం చేస్తోంది. రేపటి లోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను నెరవేర్చకుండా.. ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకుండా ఉంటే.. ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం’ అని షర్మిల సంచలన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణిగా పేర్కొన్నారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదని ఆక్షేపించారు.
‘కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం లేదు. దిక్కున్న చోట చెప్పుకోండనే రీతిలో యాజమా న్యం వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అల్టిమేటం ఇస్తున్నాం. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి.’ అని షర్మిల డిమాండ్ చేశారు.