వైసీపీ మాజీ ఎంపీకి మ‌ళ్లీ అదే జైలు.. అదే గ‌ది!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు జైలు అధికారులు మ‌ళ్లీ అదే జైలును, అదే గ‌దిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావ‌డం తెలిసిందే. టీడీపీ నాయ‌కుడిపై చేయి చేసుకున్నార‌న్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో ఆదివారం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. సోమ‌వారం ఉద‌యం గుంటూరు కోర్టులో హాజ‌రు ప‌రిచారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే 2వ తేదీ(14 రోజులు) వ‌రకు కోర్టు నందిగంకు రిమాండ్ విధించింది. అనంత‌రం పోలీ సులు ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించ‌నున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌తంలో ఓ ఎస్సీ మ‌హిళ హ‌త్య కేసులో నందిగం అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రియ‌మ్మ హ‌త్య జ‌రిగిన క్ర‌మంలో ఆమె కుటుంబం ఫిర్యాదు మేర‌కు.. నందిగంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఆ స‌మ‌యంలో నందిగంను… గుంటూరు జైలుకు త‌ర‌లించారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉన్న నందిగం ఎట్ట‌కేలకు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త‌.. ఒక‌రు త‌న ఇంటి ముందు గ‌లాభా చేశార‌ని ఆరోపిస్తూ.. స‌ద‌రు కార్య‌క‌ర్త‌ను నందిగం ఆయ‌న అనుచ‌రులు చిత‌క్కొట్టార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో తాజాగా న‌మోదైన కేసులో నందిగంను అరెస్టు చేసి కోర్టుకు హాజ‌రు ప‌రిచారు.

ఈ క్ర‌మంలో 14 రోజుల రిమాండ్ విధించ‌గా.. పోలీసులు అదే పాత జైలుకు త‌ర‌లించేందుకు..అదే పాత బ్యారెక్‌(గ‌ది)ను కేటాయించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత‌.. అన్న సామెత వైసీపీనాయ‌కుల విష‌యంలో స్ప‌ష్ట‌మ‌వుతోంది.