ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కూడినా ఒకటే చర్చ జరుగుతోంది. అదేంటంటే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తప్పదట కదా అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఈ చర్చ ఇప్పుడు జనాన్ని దాటేసి వైసీపీ నోళ్లలోనూ గట్టిగానే వినిపిస్తోంది. జగన్ ను అరెస్టు చేసేందుకే మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకుని మరీ సాగుతోందని కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఇదే మాటను శుక్రవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బహిరంగంగానే చెప్పేశారు.
లిక్కర్ కేసులో కూటమి సర్కారు జగన్ ను అరెస్టు చేసి తీరుతుందని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్టుగా అభూత కల్పనలు చేసి మరీ కేసులు కట్టారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జగన్ అరెస్టే లక్ష్యంగా తప్పుడు ఆధారాలను, సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, మాజీ అదికారులను అరెస్టు చేసి బెదిరించి జగన్ కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఓ రాజకీయ పార్టీగా, అధికారం నుంచి విపక్షంలోకి మారిపోయిన పార్టీగా వైసీపీ నుంచి ఈ తరహా ఆరోపణలు వినిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు గానీ… నేరుగా జగన్ ను అరెస్టు చేసి తీరతారంటూ ఆ పార్టీకి దాదాపుగా ఓ గొంతుకగా మారిపోయిన నాని నోట నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించడం నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. లిక్కర్ స్కాం ఆరోపణలతో పాటు నాని మరో కీలక ఆరోపణ కూడా చేశారు. స్కిల్ స్కాం కేసులో జగన్ సర్కారు టీడీపీ అదినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తనను అరెస్టు చేయించిన జగన్ ను తాను కూడా అరెస్టు చేయాలన్న కసితో చంద్రబాబు సాగుతున్నారని నాని ఓ వింత ఆరోపణ చేశారు. తనను జగన్ 53 రోజుల పాటు జైల్లో పెడితే…జగన్ ను అంతకంటే కనీసం ఒక్క రోజు ఎక్కువైనా జైల్లో పెట్టాల్సిందేనన్న దిశగా చంద్రబాబు సాగుతున్నారని నాని ఆరోపించారు. నాని వ్యాఖ్యలు చూస్తుంటే.. ఏదో పిల్లాటల్లా కనిపిస్తున్నాయన్న వాదనలు ఓ వైపు వినిపిస్తున్నా…లిక్కర్ కేసులో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాల ఆధారంగానే జగన్ అరెస్టు తప్పదన్న భావనకు వైసీపీ వచ్చిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
అయినా ఓ మాజీ సీఎంను ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అంత సులువేమీ కాదు కదా. అందులోనూ ఫ్యాక్షన్ అన్నా, పగలు, ప్రతీకారాలు అన్నా ఆమడ దూరంలో ఉండే చంద్రబాబు.. జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని చెబితే నమ్మడానికి ఏపీ ప్రజలు పిచ్చివాళ్లేమీ కాదు కదా అన్న వాదనలూ లేకపోలేదు. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించి పాత్ర ఉన్న దాదాపుగా కీలక నిందితులు అరెస్టు అయ్యారు. మిథున్ రెడ్డి మాత్రమే ముందస్తు బెయిల్ తో బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్తితిులను బేరీజు వేసుకునే జగన్ అరెస్టు తప్పదని వైసీపీ ఓ అంచనాకు వచ్చిందని, ఈ విషయాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో తెలియక…చంద్రబాబు పగ అంటూ కొత్త రాగం అందుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.