విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బలమైన మైనారిటీ నాయకుడు జలీల్ ఖాన్ పాలిటిక్స్ దాదాపు ముగిసిపోయాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా రు. అయితే.. ఎక్కడా ఉలుకు పలుకు లేదు. పైగా వయసు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 2019 ఎన్నికల్లో కుమార్తకు టికెట్ ఇప్పించుకున్నా.. ఆమె పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అమెరికా కూడా వెళ్లిపోయారు.
ఇక, గత ఎన్నికల్లో అసలు జలీల్‌ఖాన్ పేరు కూడా వినిపించలేదు. పైగా పశ్చిమ టికెట్‌ను టీడీపీ బీజేపీకి కేటాయించింది. వాస్తవానికి మైనారిటీ వర్గం.. నేతలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీ చేయడం.. గెలవడం అంతా విచిత్రంగానే ఉంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం జలీల్ ఖాన్ ఇంటికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. పార్టీ తరఫున కానీ.. ఆయనను వ్యక్తిగతంగా రాజకీయ అవసరాల కోసం వచ్చి కలిసేవారికి అవకాశం లేదని తేల్చి చెప్పారు.
దీంతో ఇప్పుడు జలీల్ ఖాన్ ఇంటికి వచ్చేవారు.. వెళ్లేవారు కూడా లేకుండా పోయారు. ఒకప్పుడు నిత్యం వచ్చేవారు వెళ్లేవారితో జలీల్ ఖాన్ ఇల్లు సందడిగా ఉండేది. అంతేకాదు.. తన వద్దకు వచ్చేవారి కోసం.. పెద్ద భోజన శాలనే ఆయన ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి బిర్యాని పెట్టి పంపించేవారని అంటారు. అలాంటిది పార్టీలో ఆయన యాక్టివ్‌గా లేకపోవడం.. పార్టీ కూడా ఆయనను పక్కన పెట్టడంతో ఇక, జలీల్ రాజకీయం ముగిసినట్టేనని అంటున్నారు.
అయితే.. విజయవాడ పశ్చిమంలో మాత్రం జలీల్ ఖాన్ మాత్రం తనదైన ముద్రను వేశారనే చెప్పాలి. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల కోసం ఆయన చాలా కృషి చేశారు. అదేసమయంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయారు. పేరుకు మైనారిటీ నాయకుడే అయినా.. ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు రావడానికి ఇదే కారణమని చెబుతారు. తొలుత కాంగ్రెస్‌లో.. తర్వాత.. వైసీపీలో.. ఇప్పుడు టీడీపీలో జలీల్ రాజకీయాలు చేశారు. ఇకపై.. జలీల్ ఖాన్ రాజకీయాలకు దూరంగా ఉంటారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates