టిడ్కో ఇళ్ల‌కు పూర్వ వైభ‌వం..

2014-19మ‌ధ్య కాలంలో రాష్ట్రంలోని పేద‌ల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల‌ను గ‌తంలో కొన్ని పూర్తి చేశారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. వీటిని పూర్తి చేయాల్సిన వైసీపీ దూరంగా ఉంది. పైగా.. ల‌బ్ధిదారుల‌కు కూడా అన్యాయం చేసింద‌నే టాక్ వినిపించింది. టిడ్కో ఇళ్ల‌కు ల‌బ్ధిదారుల నుంచి డ‌బ్బులు కూడా క‌ట్టించుకున్నారు. దీనిలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 30 శాతం, ల‌బ్ధిదారులు 10 శాతం నిధులు వెచ్చించి.. నిర్మాణాలు చేప‌ట్టారు.

ఆ ప‌ది శాతం నిధుల‌ను కూడా ప్ర‌భుత్వాలు బ్యాంకుల నుంచి ల‌బ్దిదారుల‌కు రుణాలు ఇప్పించాయి. ఇలా.. చేప‌ట్టిన ఇళ్ల‌ను వైసీపీ హ‌యాంలో నిర్ల‌క్ష్యం చేయ‌డంతో పాడుబ‌డ్డాయి. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు తాము అధికారంలోకి వ‌స్తే.. టిడ్కో ఇళ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా తాజాగా ఈ విష‌యంపై కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు. టిడ్కో ఇళ్ల స‌ముదాయాల‌కు నీటి వ‌స‌తి, ర‌హ‌దారుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

త‌ద్వారా.. సాధ్య‌మైనంత వేగంగా వ‌చ్చే నెలలో వాటిని ల‌బ్ధిదారుల‌కు అందించేలా చ‌ర్యలు తీసుకుంటు న్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు అమరావతి రాజధాని పరిధిలోని టిడ్కో గృహాలలో నివాసం ఉంటున్న ప్రజలకు త్రాగు నీటి స‌మ‌స్య‌ను త‌క్ష‌ణం తీర్చాల‌ని నిర్ణ‌యించారు. ‘అమృత్ -2’ ప‌థ‌కం నిధులు రూ.5 కోట్లను వెచ్చించి ప‌నులు చేప‌ట్టారు. ఇప్ప‌టికి ఇచ్చిన‌ టిడ్కో గృహాల్లో స‌రైన మౌలిక వ‌స‌తులు లేవు. ఇవ్వాల్సిన‌వి కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇలా నిర్ణ‌యించారు.

ప్ర‌ధానంగా అమ‌రావ‌తి ప్రాంతంప‌రిధిలోని నులక పేట గుంటూరు ఛానెల్ ప్రధాన కృష్ణా నది మంచినీటి పైప్ లైను నుంచి పనులు ప్రారంభించారు. రాజధాని ప్రాంత గ్రామాలు అయిన పెనుమాక, కృష్ణాయ పాలెం పరిధిలోని టిడ్కో గృహాలకు 6.5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మంగళ గిరి నియజక వర్గాన్ని మంత్రి లోకేష్ అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న నేప‌థ్యంలో ఈ ప‌రిధిలోని టిడ్కో వాసుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని నిర్ణ‌యించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిడ్కో ఆవాసాల‌ను మెరుగు ప‌రిచి త్వ‌ర‌లోనే అందించ‌నున్నారు.