ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నియమితులు అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన అనుమతి లేకుండా తన పార్టీ ఎంపీని అఖిల పక్షానికి ఎలా నేతృత్వం వహించమని చెబుతారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా రాజకీయాలేల అంటూ కాంగ్రెస్ కామెంట్లకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
పహల్ గాం ఉగ్రదాడి, అందులో మరణించిన భారతీయులు, దాడిలో ఉగ్రవాదులు అనుసరించిన దారుణ ప్రణాళిక, ఉగ్రవాదులకు పాకిస్తాన్ నేరుగా సాయం అందించిన తీరు, ఆ దాడికి ప్రతిగానే పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసుకుని జరిపిన ఆపరేషన్ సిందూర్, అందులో చనిపోయిన ఉగ్రవాదులు, పాక్ లోని జనావాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లని వైనం, అప్పటికీ పాక్ దుందుడుకు వైఖరి..తదితరాలను ప్రపంచదేశాలకు వివరించాలని నరేంద్ర మోదీ సర్కారు తీర్మానించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది.
ఈ అఖిల పక్షంలోకి తన పార్టీ నుంచి ఆనంధ్ శర్మ, గౌవర్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ నలుగురిని పక్కనపెట్టిన మోదీ సర్కారు.. శశి థరూర్ ను ఎంపిక చేసింది. అంతేకాకుండా అఖిల పక్షానికి నేతృత్వం వహించాలని కూడా థరూర్ ను కేంద్రం కోరింది. అందుకు థరూర్ కూడా ఓకే అన్నట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ తనదైన శైలి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన పార్టీకి చెందిన నేతలను బీజేపీ లాగేసుకుంటోందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా… శశి థరూర్ కు అఖిలపక్షానికి నేతృత్వం వహించే అర్హత లేదా? అంటే… ఆ మాటకొస్తే.. ఆ బాధ్యతను థరూర్ కంటే మెరుగైన రీతిలో నిర్వర్తించే వారే లేరని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే… రాజకీయాల్లోకి రాకముందు థరూర్ ఐక్యరాజ్యసమితిలో ఏళ్ల తరబడి పనిచేశారు. ఐరాస అంటేనే ప్రపంచ శాంతిని కాంక్షించే సంస్థ కదా. అలాంటి సంస్థలో ఏళ్ల తరబడి పనిచేయడమంటే… దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ ఆయనకు ఉన్నంత సత్సంబంధాలు మరెవరికీ ఉండవని కూడా చెప్పొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై థరూర్ కున్న అవగాహన అమోఘమనే చెప్పాలి.
ఈ కారణంగానే కదా…ఐరాసలో ఉద్యోగాన్ని వదిలి భారత్ కు రాగానే… కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. థరూర్ అడగకుండానే ఎంపీ టికెట్ ఇచ్చి…ఆయనను గెలిపించుకుని మరీ ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్సే కదా. ఆ తర్వాత థరూర్ పై చాలా వివాదాలు వచ్చినా. అవన్నీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవే తప్పించి… దేశ భద్రతకు గానీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించేవి కాదు కదా. ఈ లెక్కన కాంగ్రెస్ వద్దన్నా కూడా అఖిలపక్షానికి థరూర్ నేతృత్వం సరైన నిర్ణయం అని చెప్పక తప్పదు.