విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జైలు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, బెజవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ లిక్కర్ స్కాం నిందితులు, ఏపీపీఎస్పీ అక్రమాల కేసు నిందితులు, టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసుల నిందితులు.. ఇలా అన్నీ రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసుల నిందితులు అక్కడే ఉంటున్నారు. ఉన్నట్టుండి… శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ కార్యాలయం బెజవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హంసపాల్ ను ఉన్నపళంగా బదిలీ చేసింది.
ఈ పరిణామం క్షణాల్లో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కీలక కేసులకు సంబంధించిన నిందితులు ఉంటున్న జైలు వ్యవహారాలను హంసపాల్ సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారా?.. లేదంటే ఆయా నిందితులకు ఏమైనా సహకారం అందిస్తున్నారా? అన్న కోణంలో… ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. హంసపాల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు అటాచ్ చేసిన డీజీ కార్యాలయం..అక్కడి శిక్షణా కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చింది. అదే సమయంలో హంసపాల్ స్థానంలో మహ్మద్ ఇర్ఫాన్ అనే అధికారిని నియమించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఓ సబ్ జైలుకు ఆయన సూపరింటెండెంట్ గా పనిచేస్తుండగా… పదోన్నతి ఇచ్చి మరీ ఆయనను బెజవాడకు పంపింది.
ఇతరత్రా నిందితుల విషయం ఎలా ఉన్నా వల్లభనేని వంశీ, పీఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ గతంలో బద్ధ శత్రువులుగా సాగారు. అయితే వైసీపీ అదికారంలోకి వచ్చాక… వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి చేరగా.. అప్పటికే వైసీపీకి అనుకూలంగా మారిన పీఎస్ఆర్ కు కీలక పోస్టింగులు దక్కాయి. ఈ పరిణామాలు వంశీ, పీఎస్ఆర్ ల మధ్య దూరాన్ని తగ్గించాయో, లేదో తెలియదు గానీ… వారిద్దరూ ఒకే జైలులో ఉండటంతో ఇప్పటికే బెజవాడ జిల్లా జైలుపై అందరిలోనూ ఆసక్తి ఉంది. అలాంటి సమయంలో ఉన్నపళంగా జైలు సూపరింటెడెంట్ ను బదిలీ చేయడం, ఓ తక్కువ స్థాయి అదికారికి ప్రమోషన్ ఇచ్చి మరీ బెజవాడ జైలుకు పంపడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
బెజవాడ జిల్లా జైలులో వంశీ మూడు నెలలుగా ఉంటున్నారు. తొలుత కిడ్నాప్ కేసులో అరెస్టైన ఆయనపై ఆ తర్వాత వరుసబెట్టి కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా కొన్ని కేసుల్లో బెయిల్ దక్కినా… ఆయన మాత్రం జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో అప్పటికే పలు అనారోగ్య సమస్యలు ఉన్న వంశీ.. ఇప్పుడు ఏకంగా 20కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా ఆయన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. బయటకు వచ్చినప్పుడు ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకుని దగ్గుతూ, నడవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరహా పరిస్థితికి కారణాలేమిటో తెలియదు గానీ… జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇటీవలే జైళ్ల శాఖ డీజీ మొహ్మద్ అహసాన్ రెజా తన రొటీన్ తనిఖీల్లో భాగంగా విజయవాడ జిల్లా జైలును సందర్శించారట. ఈ సందర్భంగా ఆయన జైలులో పలు లోటుపాట్లను గమనించినట్లు సమాచారం. అయితే వాటిపై తనిఖీల సందర్భంగా ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయిన డీజీ.. హఠాత్తుగా శుక్రవారం రాత్రి విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేయడం ప్రాదాన్యం సంతరించుకుంది. ఈ లెక్కన జైలులో జరుగుతున్న విషయాలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే హంసపాల్ బదిలీపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కీలక కేసుల నిందితులు ఉన్న బెజవాడ జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీ మాత్రం అందరిని విస్మయానికి గురి చేసింది.