వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి.. జగన్ పాలనలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, ఆయనకు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా చేసిన కృష్ణమోహన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అధికారులు వివరించారు. అరెస్టు నేపథ్యంలో విజయవాడలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా.. పోలీసులు ఆంక్షలు విధించారు.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని మార్చి.. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కూటమి ప్రభుత్వం విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖ రబాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అప్పటి నుంచి విచారణ ముమ్మరంగా సాగుతోంది. మద్యం వ్యవహారంలో పలు రకాలుగా దోచుకున్నారన్నది అధికారులు చెబుతున్న వాదన. దీనినే విచారణలో వెలుగు తీస్తున్నారు.
ఈ క్రమంలోనే తొలుత మద్యం వవహారాన్ని నడిపించిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో ఈ మద్యం కుంభకోణంలో త్రిమూర్తులుగా వ్యవహరించారంటూ.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ గోవిందప్ప బాలాజీలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. మొత్తంగా వారు తప్పించుకునే ప్రయత్నం చేసినా.. ఎట్టకేలకు అరెస్టు చేశారు.
బెయిల్ వస్తుందని..
సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు.. సుప్రీంకోర్టు గత వారం ప్రసాదించిన ముందస్తు రక్షణతో బయటకు వచ్చారు. అయితే.. తాజాగా ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ముందస్తు రక్షణతోపాటు.. ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తోసిపుచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి సిట్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌లను అరెస్టు చేశారు. శనివారం ఉదయం లేదా శుక్రవారం రాత్రే వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. అనంతరం.. జైలుకు తరలించనున్నారు.