తెలంగాణ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మంత్రులు అందరూ లంచాలు తీసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. తాను మాత్రం ఎలాంటి లంచాలు తీసుకోకుండానే పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన కొన్ని నిమిషాలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. రాజకీయ ప్రత్యర్థులు సూటి ప్రశ్నలతో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. దీంతో మంత్రి యూటర్న్ తీసుకున్నారు.
ఏం జరిగింది?
గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ప్రభుత్వంలో ఫైళ్లు పేరుకు పోతున్నాయని చెప్పారు. పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు. దీనికి కారణం పైసలేనని చెప్పుకొచ్చారు. పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రులు అందరూ పైసలు ఇస్తే కానీ పనులు చేయట్లేదు. పైసలు చూసుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. కానీ నేను మాత్రం అలా కాదు. పైసలు తీసుకోకుండానే పనులు చేస్తున్నా. ఫైళ్లు క్లియర్ చేస్తున్నా అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు. తక్షణమే దీనిపై విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెబుతున్నామని.. అయినా సీఎం పట్టించుకోవడం లేదని, సొంత మంత్రే విషయాన్ని బయట పెట్టారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యవహారం ముదురుతుండడంతో మంత్రి సురేఖ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె ఆరోపించారు. తాను బీఆర్ఎస్ హయాంలో మంత్రుల గురించి చెప్పానని అన్నారు. అయితే.. తన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ.. మీడియా వక్రీకరించిందన్నారు. అయితే.. ఇది నిజమేనని అనుకుంటే.. తన గురించి మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడారన్న దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. నేను మాత్రం లంచాలు తీసుకోకుండానే ఫైళ్లు క్లియర్ చేస్తున్నా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ప్రశ్న. ఏదేమైనా నోరు జారి.. మీడియాపై నిందలు వేయడంపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.