చేసుకున్న పాపం చెబితే పోతుందని సామెత. కానీ.. రాజకీయాల్లో చెప్పినా చెప్పకపోయినా.. పోయేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే పాపాల తీవ్రత అలా ఉందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగాకాదు.. మూకుమ్మడిగా ముందుకు వస్తున్నాయి. దీంతో వదల వంశీ అంటూ కేసులు.. జైళ్లు.. ఆయనను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది.
1) సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో బెయిల్ పొందారు. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని.. కుటుంబం సహా.. ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే…2వ కేసు విషయానికి వస్తే.. ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి.. వాటితో సదరు ఇంటిని వేరే వ్యక్తి (వంశీ అనుచరుడని టాక్) స్వాధీనం చేసుకునేలా వంశీ సహకరించారి కేసు నమోదైంది. దీంతో ఆయన మళ్లీ జైలులోనే ఉన్నారు. అయితే.. చిత్రంగా దీనిలోనూ ఆయనకు బెయిల్ వచ్చింది.
అయితే.. 2019 ఎన్నికల సమయంలో వంశీ ప్రసాదంపాడు (విజయవాడ శివారులో)లోని ఓ బూత్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లి హల్చల్ సృష్టించారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో ఇది విచారణలో ఉంది. ప్రస్తుతం దీనిలో బెయిల్ దక్కితే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని కుటుంబం ఆశలు పెట్టుకుంది. కానీ, ఇంతలోనే మరో కేసు తెరమీదకి వచ్చింది.
అది కూడా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ నమోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేయడంతోపాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. అంటే.. ఇది కొత్త కేసన్నమాట. దీంతో వంశీ ఎన్నికల కేసు నుంచి బెయిల్ పొందినా.. తాజాగా నమోదైన కేసులో జైల్లోనే ఉండనున్నారన్న మాట. దీంతో చేసిన పాపాలు పట్టి పీడిస్తున్నాయని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.