=

కడపలో ఏంజరుగుతుంది జగన్?

వైసీపీ గడపగా కడప జిల్లాకు పేరుంది. పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో గడచిన 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీదే ఆధిపత్యం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైసీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్న జగన్ కూడా కడపలో తన హవాను కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీల్లో చేరి పోతున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసే వారే కరువవుతున్నారన్న వాదనలు లేకపోలేదు.

ఇప్పటికే కడప జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలంతా సైలెంట్ అయిపోయారు. మరికొందరు ఏకంగా పార్టీనే వీడారు. ఆ తర్వాత వారంతా వైసీపీ ప్రత్యర్థి పార్టీల్లో చేరారు. తాజాగా మైదుకూరు నియోజకవర్గంలోనూ ఈ తరహా ఓ కీలక పరిణామం గురువారం చోటుచేసుకుంది. మైదుకూరు మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత చంద్ర పార్టీకి రాజీనామా చేశారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న చంద్ర.. తాజాగా గురువారం పార్టీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

చంద్ర మునిసిపల్ చైర్మన్ అయినా… మైదుకూరు పట్టణంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. అంతేకాకుండా మైదుకూరు చుట్టుపక్కల పల్లెల్లోనూ ఆయనకు ఓ రేంజి మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే వైసీపీ అదికారంలో ఉండగా… చంద్రకు మునిసిపల్ చైర్మన్ పదవి దక్కింది. పార్టీ అధికారంలో ఉన్నంత వరకూ బాగానే ఉన్నా.. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ హవా కొనసాగిన సమయంలో వరుసగా రెండు సార్లు మైదుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామిరెడ్డి… 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ శ్రేణులను పట్టించుకోవడం మానేశారు.

ఈ క్రమంలో పార్టీలో కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి అంతకంతకూ విషమిస్తున్న పరిస్థితుల గురించి చంద్ర…మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ అదికారంలో లేదు కదా… ఇప్పుడేం చేద్దాం అంటూ మాజీ ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించడంతో చంద్ర షాకయ్యారట. తనను జగన్ వద్దకు ఓ సారి తీసుకెళ్లండి అంటూ చంద్ర గత 3 నెలలుగా మాజీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారట. అయితే రఘురామిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగు చెందిన చంద్ర… గురువారం వైసీపీకి షాకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు.