ఏపీ ప్రతిపక్షం వైసీపీ ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. రెండు స్థానిక సంస్థలు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. వీటిలో ఒకటి.. పల్నాడు జిల్లాలోని మాచర్ల మునిసిపాలిటీ కాగా.. రెండోది వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప మునిసిపల్ కార్పొరేషన్. ఈ రెండు మునిసిపాలిటీల చైర్మన్‌లపై కూటమి సర్కారు బుధవారం ఒక్కసారే వేటు వేసింది. వీటిలో ఒకరు నిబంధనలు పాటించకపోవడం కారణమైతే.. మరొకరు అవినీతి పాల్పడ్డారన్న అభియోగాలు ఉండడమే కారణం. దీంతో ఇద్దరినీ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇది వైసీపీకి భారీ ఎదురు దెబ్బేనని అంటున్నారు ఆ పార్టీ నాయకులు.
పల్నాడులో..
పల్నాడు జిల్లాలోని మాచర్ల మునిసిపాలిటీలో 2021-22 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో వైసీపీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే పిన్నెల్లి అనుచరుడిగా పేరున్న కిషోర్‌కుమార్‌ను మాచర్ల మునిసిపాలిటీ చైర్మన్ చేశారు. అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆయన వ్యవహార శైలిపై దృష్టి పెట్టింది. ఛైర్మన్ పదవి దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణకు ఆదేశించింది.
ఈ క్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో విచారణ జరిపి.. ప్రబుత్వానికి నివేదిక అందించారు. అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు కిషోర్ కుమార్ ఎగ్గొట్టారని, ఇది మునిసిపల్ చట్టంలోని సెక్షన్ 16(1)ని తోసిపుచ్చడమేనని నివేదికలో పేర్కొన్నారు. దీంతో సర్కారు ఆయనపై చర్యలకు ఆదేశించింది. ఆ వెంటనే ముఖ్యకార్యదర్శి.. చైర్మన్ కిషోర్‌కుమార్‌ను పదవీచ్యుతిడిని చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కడపలో..
కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్‌బాబు అవినీతి పాల్పడ్డారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై విచారణకు విజిలెన్సును నియమించిన ప్రభుత్వం పూర్తి అధికారాలను కలెక్టర్ కు అప్పగించింది. కార్పొరేషన్‌లో పనులను కాంట్రాక్టు బేసిక్‌గా ఇవ్వకుండా.. తన కుటుంబానికి ముఖ్యంగా తన భార్య పేరుతో ఉన్న కాంట్రాక్టు కంపెనీకి నామినేటెడ్ పద్దతిపై ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో 36 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని కలెక్టర్ గుర్తించారు. దీనిపై వివరణ కోరుతూ.. మేయర్ సురేష్ బాబుకు పలు దఫాలుగా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేదని గ్రహించిన ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.