పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదంపై కఠినంగా దూసుకెళుతున్న భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత్ తన సంకల్పాన్ని నిరూపించుకున్న తరుణంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్ ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా వెల్లడించేందుకు కేంద్రం గట్టిగా కదులుతోంది.
ఇప్పటికే ఆస్ట్రియా విదేశాంగ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన జైశంకర్, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక సమాచారం అందించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. ఉగ్రవాదానికి చరమగీతం పాడే సమయంలో భారత్ వెనక్కి తగలదని, అందుకే అంతర్జాతీయ మద్దతు అవసరమని స్పష్టం చేశారు. ఈ చర్చలో అణ్వస్త్రాల అంశం, భద్రతాపరమైన బెదిరింపులపై కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అంతేకాక, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఆపరేషన్ సిందూర్ గురించి, దాని నేపథ్యం, లక్ష్యాలు, విజయాలు ఇలా మొత్తం వివరించారు. భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఉండాలని కోరారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో సమన్విత చర్యలు అవసరమన్న దృష్టితో ఇది జరగడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ విదేశాంగ శాఖ దాదాపు 70 దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిపింది. అమెరికా, రష్యా, జపాన్, యూకే వంటి దేశాలకు భారత్ ఉగ్రవాదంపై స్పష్టమైన సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌కి అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని ప్రపంచం మొత్తం ముందుకు తీసుకురావడం ద్వారా భారత్ ఈ దౌత్యపరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది.