వైసీపీ కీలక నేత, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రైట్ హ్యాండ్ గా కొనసాగుతున్న వైసీపీ నేత, మాచర్ల మునిసిపల్ చైర్మన్ తురకా కిశోర్ పై కూటమి సర్కారు వేటు వేసింది. వరుసబెట్టి 15 మునిసిపల్ సర్వసభ్య మావేశాలకు హాజరు కాని ఆయనపై రాఫ్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో సురేశ్ కుమార్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
తురకా కిశోర్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిన్నెల్లికి అనుచరుడిగా కొనసాగిన ఆయన.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే.. పిన్నెల్లి సైన్యంలో మరింతగా యాక్టివేట్ అయ్యారు. ఈ క్రమంలో మాచర్ల మీదుగా వెళుతున్న టీడీపీ నేతలు, బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై కిశోర్ ఏకంగా హత్యాయత్నానికి దిగారు. ఆజానుబావుడైన కిశోర్.. తన రూపానికి సరిపడ పొడుగాటి దుంగను తీసుకుని టీడీపీ నేతల కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో కారు డ్రైవర్ చాకచక్యంగా కారును స్పీడుగా నడపడంతో బోండా, బుద్ధా బతికిపోయారు.
ఈ ఘటనపై నాడే కేసు నమోదు కాగా… పిన్నెల్లి కనుసైగలతో సాగిన పోలీసులు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అదికారంలోకి రావడంతో భయపడిపోయిన కిశోర్ మాచర్లతో పాటు పల్నాడు జిల్లానే వదిలి పరారయ్యారు. అయితే కిశోర్ పై గట్టి నిఘా పెట్టిన పోలీసులు ఆయనను ఇటీవలే అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. కూటమి అదికారం చేపట్టిన నాటి నుంచి కిశోర్.. మాచర్ల మునిసిపల్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడం లేదు.
ఇదే విషయాన్ని పరిశీలించిన మునిసిపల్ పరిపాలనా శాఖ కిశోర్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు వరుసగా 15 మునిసిపల్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని చైర్ పర్సన్ అయినా, సభ్యులు అయినా అనర్హులుగా తేలిపోతారు. ఈ నేపథ్యంలో కిశోర్ కూడా ఇప్పటిదాకా 15 సర్వసభ్య సమావేశాలకు హాజరు కాలేదట. ఇదే నిబంధనను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం కిశోర్ పై వేటు వేసింది.