వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలోని జైలుకు తరలిం చారు. జగన్ పాలనలో నాసిరకం మద్యాన్ని భారీ ధరలకు విక్రయించారు. అంతేకాదు.. తమకు అనుకూలంగా ఉన్న కంపెనీల కు మాత్రమే అవకాశం కల్పించారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు బాటిల్ బాటిల్‌కు ఇంతని రేటు కట్టి వసూలు చేశారని మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది.
ఇలా వచ్చిన నిధులను ఎలా మళ్లించాలి? ఎక్కడ దాచాలి? ఏయే మార్గాల్లో తరలించాలన్న కీలక విషయాలను భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్, ప్రముఖ ఆడిటర్ బాలాజీ గోవిందప్పే చూసుకున్నారన్నది అధికారులు చెబుతున్న విషయం. ఈ నేపథ్యంలోనే ఆయనను ఈ కేసులో ఏ-33గా పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన నిందితులతో పాటు ఆయన కోసం కూడా గాలించారు. తొలుత నోటీసులు ఇచ్చినా.. ఆయన కనిపించలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లి మరీ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ బాలాజీ గోవిందప్ప స్పందించలేదు.
మరోవైపు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వీటిని పదే పదే కోర్టులు తోసిపుచ్చాయి. ఈ క్రమంలో మరింత ముమ్మరంగా గాలించిన సిట్ అధికారులు మంగళవారం ఉదయమే బాలాజీ గోవిందప్ప అడ్రస్ పట్టుకున్నారు. మైసూరులో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను విజయవాడకు తీసుకువచ్చి.. ఆరోగ్య పరీక్షల అనంతరం.. ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఇద్దరు సిట్ ముందుకు..
ఇక, ఇదే కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ఏ-31, ఏ-32లు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు బుధవారం విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. దీంతో వీరిని సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. మద్యం కుంభకోణంలో వీరి పాత్రపై ఆరా తీశారు. అయితే.. తమకు ఏమీ తెలియదని.. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని.. కావాలంటే తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవచ్చని ఇరువురు చెప్పినట్టు తెలిసింది. అయితే.. సిట్ అధికారులకు దొరక్కుండా తప్పించుకోవడంపైనా అధికారులు ఆరా తీసినట్టు సమాచారం.