నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే. అయితేనేం… ఆ పార్టీకి పార్లమెంటు దిగువ సభ లోక్ సభలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. పార్టీ తరఫున మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ రాజకీయవేత్త వల్లభనేని బాలశౌరికి లోక్ సభలో ఓ కీలక పదవి దక్కింది. లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా బాలశౌరి ఎంపికయ్యారు. ఈ కమిటీకి ఇప్పటికే చైర్మన్ గా కొనసాగుతున్న బాలశౌరికి వరుసగా రెండో పర్యాయం ఈ పదవిని స్పీకర్ ఓం బిర్లా అప్పగించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మచిలీపట్నం నుంచే బాలశౌరి ఎంపీగా గెలిచారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందుగానే ఆయన వైసీపీకి రాజీనామా చేసి నేరుగా పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి జనసేనలో చేరిపోయారు. జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన బాలశౌరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు. తాను కూడా మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. నిత్యం పవన్ వెన్నంటి నడుస్తున్న బాలశౌరి… పార్లమెంటరీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ తో పాటు తన నియోజకవర్గానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో బాలశౌరిది అందె వేసిన చెయ్యిగా చెప్పాలి.
తాజాగా బాలశౌరి నేతృత్వంలోని లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ కాల పరిమితి ముగియగా… ఆ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులున్న ఈ కమిటీకి తిరిగి బాలశౌరినే రెండోసారి చైర్మన్ గా నియమిస్తూ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ఆయా కార్యకలాపాలు, సభ్యులకున్న అధికారాలు, బాధ్యతలు సరిగ్గా అమలు అయ్యేలా చర్యలు చేపట్టడం, సభలో విధివిధానాల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇంతటి గురుతర బాధ్యతలు ఉన్న ఈ కమిటీ చైర్మన్ తనను రెండోసారి నియమించిన ఓం బిర్లాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తనకు ఈ అవకాశం దక్కేలా చూసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates