చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును త‌ల‌పోశారు. ఇక నుంచి చేప‌ట్టే.. అన్ని నియామ‌కాల్లోనూ.. ఎస్టీ ప్రాంతాల్లో వారినే పూర్తిగా నియ‌మించాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారుల‌కు కూడా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ.. ప్ర‌భుత్వం చేప‌ట్టే ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న వంటివాటిలో 100కు వంద శాతం.. గిరిజ‌న బిడ్డ‌ల‌కే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

అయితే.. వాస్త‌వానికి చంద్ర‌బాబు చేసిన ఈ ఆలోచ‌న ఇప్ప‌టిది కాదు. 2014-19 మ‌ధ్య కాలంలోనే గిరిజ‌న ఎమ్మెల్యేల విన‌తుల మేర‌కు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్టీలు ఎక్కువ‌గా ఉన్న మండ‌లాల‌ను గుర్తించి.. అక్క‌డ జ‌రిగే రిక్రూట్‌మెంట్ల‌ను పూర్తిగా గిరిజ‌నుల‌తోనే భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు. అయితే.. దీని పై ఎస్సీ సామాజిక వ‌ర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. దీంతో ఇలా రిజ‌ర్వేష‌న్ ఏక‌ప‌క్షంగా ఇవ్వ‌డం కుద‌రద‌ని తేల్చి చెప్పింది. చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లోనే సుప్రీం కొట్టేసింది.

అయితే.. త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. నా ఎస్సీలు, నా ఎస్టీలు.. అన్నారే త‌ప్ప‌.. వారికి మేలు చేసే ఈ నిర్ణ‌యం పై ఎలాంటి అడుగు వేయ‌క‌లేక పోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును.. పునః స‌మీక్షిం చేలా పిటిష‌న్ వేసే హ‌క్కు ఉన్నా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక్క నిర్ణ‌యం కూడా తీసుకోలేక‌పోయారు. దీంతో ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు తిరిగి.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు.

అయితే.. చ‌ట్ట‌బ‌ద్ధం కాని, ఒప్పంద‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే గిరిజ‌నుల‌తో భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత‌.. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌భుత్వ పూర్తిస్థాయి పోస్టుల‌ను కూడా ఆ తీర్పున‌కు అనుగుణంగా భ‌ర్తీ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇది స‌క్సెస్ అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌నుల‌కు ఓ మేలు మ‌లుపు అవుతుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.