వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి, అప్పటి సీఎం జగన్‌కు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, విచారణ సాగుతున్న సమయంలో మైసూరులో పోలీసుల చేతికి చిక్కిన ప్రముఖ ఆడిటర్ బాలాజీ గోవిందప్పకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వనింది.
వాస్తవానికి, ముగ్గురు కూడా గత రెండు వారాలుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, ఆయన పలువురు కీలక నిందితుల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కూడా కేసులో నిందితులుగా పేర్కొన్నారు. వెంటనే వారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.
దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత అక్కడ కూడా బెయిల్ మంజూరు కాలేదు. పలు మార్లు పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే తాజాగా మరోసారి చివరి ప్రయత్నంగా వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు పలు నిబంధనలు, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
విచారణకు పూర్తిగా సహకరించాలి, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలి, సాక్షులను బెదిరించరాదు, అధికారుల పిలుపు మేరకు ఎప్పుడైనా విచారణకు హాజరుకావాలన్న షరతులతో బెయిల్ మంజూరైంది. అయితే అప్పటికే బాలాజీ గోవిందప్ప మైసూరులో అరెస్ట్ కావడంతో, ఆయనకు మాత్రం బెయిల్ నిరాకరించారు.
ఈ నేపథ్యంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మాత్రమే శుక్రవారం వరకు పరిమితమైన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటివరకు వారిని పోలీసులు అరెస్ట్ చేయరాదని, దురుసుగా ప్రవర్తించకూడదని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.