భార‌త్‌-పాక్ యుద్ధాన్ని ఆపా: ట్రంప్ సెల్ఫ్ గోల్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య తానే యుద్ధాన్ని నిలువ‌రించా న‌ని తాజాగా చెప్పుకొచ్చారు. యూఎస్ మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. అతి పెద్ద అణుయుద్ధాన్ని నిలువ‌రించిన‌ట్టు తెలిపారు. భార‌త్‌-పాకిస్థాన్‌లు రెండూ అణుయుద్ధానికి దిగే అవ‌కాశం ఉంద‌ని గ‌మ‌నించి.. తానే యుద్ధాన్ని నిలువ‌రించేలా వారిని ఒప్పిం చాన‌ని పేర్కొన్నారు. ఇరు దేశాల‌ను అత్యంత ఘ‌న‌మైన దేశాలుగా పేర్కొన్న ట్రంప్‌.. త‌న సంబంధాలు రెండు దేశాల‌తోనూ కొన‌సాగుతాయ‌న్నారు.

భార‌త్‌-పాక్‌ల మ‌ధ్య యుద్ధ నివార‌ణ‌లో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి రుబియోలు విశేషంగా కృషి చేశా రని ట్రంప్ పేర్కొన్నారు. భార‌త్‌-పాక్‌లు రెండు త‌న‌కు మిత్ర‌దేశాల‌ని.. రెండు దేశాల్లోనూ బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తి ఉంద‌ని.. పాల‌నా శ‌క్తి ఉన్నాయ‌ని తెలిపారు. తాను యుద్ధాన్ని నిలువ‌రించాల‌ని.. కాల్పుల విర‌మ‌ణ‌ను పాటించాల‌ని ఇరు దేశాల‌పై ఒత్తిడి తెచ్చిన‌ట్టు తెలిపారు. దీంతో లక్ష‌లాది మంది ఇరు దేశాల పౌరుల ప్రాణాల‌ను కాపాడాన‌ని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ ప్రపంచానికి కూడా మేలు చేశాన‌న్నారు.

“యుద్ధాన్ని నివారించ‌డంలో నేను వాడిన వాణిజ్యం జోక్యం గ‌తంలో ఎవ‌రూ వినియోగించ‌లేదు“ అని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల‌తోనూ.. భ‌విష్య‌త్తులోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌న్నారు. అణు యుద్ధ‌మే జ‌రిగి ఉంటే.. ఊహించ‌ని పెను ఉప‌ద్ర‌వాన్ని మ‌నం చూసి ఉండేవార‌ని, ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు చ‌నిపోయి ఉండేవార‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ.. త‌ను అలా కాకుండా చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఇరు దేశాల‌తోనూ త‌న వాణిజ్య కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయ‌ని ట్రంప్ వెల్ల‌డించారు. ఈ విష‌యంలో మున్ముందు ఇరు దేశాల‌తో ట‌చ్‌లో ఉంటామ‌న్నారు.

కాగా.. దాయాదితో మ‌న దేశం కాల్పుల విర‌మ‌ణ విష‌యంలో ట్రంప్ జోక్యంపై భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా అమెరికా జోక్యం మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని ప్ర‌ధాని మోడీ తేల్చి చెప్పిన‌ట్టు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. మ‌రోవైపు పాకిస్థాన్‌.. ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేయ‌డం గ‌మ‌నార్హం.